వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఆపై ఆచితూచి, అతి జాగ్రత్తగా పదాలు ఎంచుకుని మరీ చెప్పిన క్షమాపణ, తరువాత సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చిన స్పందనలు- ఇవీ మహిళల దుస్తులను ఉద్దేశించి సినిమా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు. శివాజీ వ్యాఖ్యలను ఒక చిన్న తప్పిదంగా పరిగణించడం కష్టం. తెలుగు సినిమా పరిశ్రమలో, సోషల్ మీడియా వ్యవస్థలో మహిళలపట్ల ద్వేషం ఎంతలా పెరిగిపోయిందో, దానికి ఎలా ప్రోత్సాహం లభిస్తోందో, చివరకు దానినుంచి ఓ చిన్నపాటి క్షమాపణతో ఎలా బయటపడుతున్నారో చెప్పేందుకు ఈ సంఘటన ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ నేపథ్యంలో.. తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ చెప్పిన క్షమాపణ ఎందుకు ఎంతమాత్రం చాలదో చర్చించవలసిన అవసరం ఉంది.
చాలాకాలంగా సరైన అవకాశాలు లేని నటుడు శివాజీకి ‘కోర్ట్ -స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ చిత్రం ద్వారా మంచి బ్రేక్ లభించింది. ఈ చిత్రాన్ని నటుడు నాని తన వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ‘బిగ్‌బాస్ సీజన్-7’ తర్వాత అతడికి లభించిన మరో ముఖ్యమైన అవకాశం త్వరలో విడుదలకానున్న ‘దండోరా’ చిత్రం. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. మహిళలు రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరిస్తున్నారని, అవి గౌరవానికి విరుద్ధమని చెప్పడమే కాకుండా, మహిళల శరీరాలను అవమానకరంగా ప్రస్తావిస్తూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. చీరకట్టుకుని శరీరాన్ని కప్పుకోవాలంటూ అనవసరమైన సలహాలు కూడా ఇచ్చాడు. నిధి అగర్వాల్, సమంత రూత్ ప్రభు వంటి నటీమణులపై అభిమానులు ఇటీవల జరిపిన దాడులు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన వేళ అలాంటి సందర్భాల్లో అభిమానుల ఆగడాలను సమర్థించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.
‘మహిళలపై గౌరవం’ అనే ముసుగులో శివాజీ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక ‘స్టంట్’ అని అనిపించక మానదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించాలంటే ట్రెండ్‌నే ప్రధానంగా చూస్తారు. అందుకు మహిళలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఒక దగ్గరి దారిగా మారిపోయింది. ఈ కోణంలో చూస్తే, శివాజీ తనకు కావలసినంత ఆన్‌లైన్ అటెన్షన్ దక్కించుకున్నాడు. పాప్యులారిటీ ఎలా వచ్చినా పర్లేదు అనుకునే ఇప్పటి పరిస్థితిలో శివాజీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ లేదు. మహా అయితే కొన్ని తిట్లు, మరికొన్ని చీవాట్లు. తాజా ఉదంతంలోనైతే, శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ మా అధ్యక్షుడికి వాయిస్ ఆఫ్ ఉమెన్ టిఎఫ్‌ఐ లేఖ రాయడం, అంతే. అంతటితో ఈ వివాదానికి తెర పడుతుంది. ఈ క్రమంలో శివాజీకి కావలసినంత పబ్లిసిటీ లభిస్తుంది. మహిళా ద్వేషులనుంచి కాస్త సానుభూతి కూడా దక్కుతుంది.
మహిళల వయసు, వేషధారణతో సంబంధం లేకుండా వారిపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా శివాజీ వంటివారికి అవేమీ పట్టవు. గౌరవం, సంస్కృతి అనే ముసుగులో మహిళలపై తీర్పులు చెప్పడం, అవమానకర వ్యాఖ్యలు చేయడమనే సంస్కృతి ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. తమ తమ ఎజెండాలనుబట్టి సెలబ్రిటీలు కూడా ఈ ధోరణిలో భాగమవుతున్నారు.వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిసారీ నిరసనలు వెల్లువెత్తుతాయి. కానీ బాగా నిరాశ కలిగించే అంశమేమిటంటే, సోషల్ మీడియాలోని కామెంట్ల సెక్షన్ లో ఇలాంటి వ్యాఖ్యలకు మద్దతే ఎక్కువగా లభిస్తూ ఉండటం. సంస్కృతి, భారతీయ విలువలు, గౌరవంవంటి పదాలు చివరకు మహిళలపై నియంత్రణ సాధించే ఆయుధాలుగా మారుతున్నాయి.
ఇంటర్నెట్ అనేది సమాజానికి అద్దంలాంటిది. ఆన్‌లైన్‌లో స్త్రీద్వేషానికి లభిస్తున్న మద్దతు, వాస్తవ ప్రపంచంలో ఉన్న పితృస్వామ్య ఆలోచనలకు ప్రతిబింబమే. ఈ సందర్భంలో ఆండ్రూ టేట్ ఉదాహరణ ప్రస్తావించాల్సిందే. ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొన్న ఈ వ్యక్తి ఒక దశలో మహిళా వ్యతిరేక వ్యాఖ్యలతో టిక్‌టాక్‌లో డొనాల్డ్ ట్రంప్, కిమ్ కర్డాషియన్‌లను మించిపోయాడు. చివరకు అతడు సోషల్ మీడియా నుంచి నిషేధానికి గురయ్యాడు. కానీ అప్పటికే యువత ప్రమాదకరమైన అతడి ప్రభావానికి తీవ్రంగా లోనైంది. ఈ నేపథ్యంలో చూస్తే శివాజీ వ్యాఖ్యలు, ఆపై వచ్చిన అస్పష్టమైన క్షమాపణ, ప్రెస్‌మీట్, వేలాది రీల్స్, కోట్ల వ్యూస్, నిరసనలు.. ఇవన్నీ విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చాయి.
ఇలాంటి పరిస్థితులలో ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిన వైరల్ స్టంట్ కాకూడదని ఆశిద్దాం. ఎందుకంటే కేవలం వైరల్ అయ్యే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటే గనుక, ఆ ప్రభావం యువతపై పడి, వారి మనసులను కలుషితం చేస్తుంది. ఇలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలేమీ తీసుకోకుండా వదిలేస్తే ఇలాంటి వారు మరికొందరు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది. శివాజీ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి, ప్రమాదకరమైనవీ. అవి అసభ్యపదజాలంతో కూడుకున్నవి మాత్రమే కావు. మహిళలపై దాడులు చేసేవారిని సమర్థించేవిగా ఉన్నాయనే సంగతి గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శివాజీపై తెలుగు చిత్ర పరిశ్రమ కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో అది సమాజానికి మాత్రమే కాదు, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠకు కూడా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.
-రాజేశ్వరీ కల్యాణం
(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)