కథ: 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ మాత్రం దేశంలో కలవకుండా ప్రత్యేక సంస్థానంగా నిజాంల పాలనలోనే కొనసాగుతుంటుంది. ఈ ప్రాంత ప్రజలకు ఇండియాలో కలవాలని ఉన్నా.. భారత ప్రభుత్వమూ అందుకు ప్రయత్నం చేస్తున్నా.. నిజాం మాత్రం అందుకు అంగీకరించరు. నిజాం సైన్యం, రజాకార్ల అకృత్యాలకు అల్లాడిపోతున్న ప్రజలు తమకెప్పుడు స్వాతంత్య్రం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలోని బైరాన్ పల్లి మాత్రం రజాకార్ల మీద వీరోచితంగా పోరాడుతూ ఆదర్శంగా నిలుస్తుంటుంది. ఆ ఊరి పోరాటాన్ని అణచివేయాలని రజాకార్లు చూస్తుంటారు. అలాంటి చోటికి ఫుట్ బాలర్ అయిన మైఖేల్ విలియమ్స్ (రోషన్ మేక) అనుకోని పరిస్థితుల్లో వస్తాడు. ఇంగ్లాండుకు వెళ్లి అక్కడ ఫుట్ బాల్ ఆడాలని కలలు కంటున్న మైఖేల్.. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఒక మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంతకీ తన మిషన్ ఏంటి.. అతను బైరాన్ పల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది.. రజాకార్లతో బైరాన్ పల్లి పోరాటంలో అతను ఎలా భాగమయ్యాడు. చివరికి మైఖేల్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ: బైరాన్ పల్లి.. తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలిసిన వాళ్లకు ఈ పేరు చెబితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ‘ఛాంపియన్’ సినిమాతో ఆ ఊరి కథను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. కాకపోతే విడిగా ఈ కథనే చెబితే ఆ అనుభూతి వేరుగా ఉండేదేమో. కానీ ఈ వాస్తవ గాథలోకి ఒక కల్పిత ఫుట్ బాలర్ పాత్రను తీసుకొచ్చి మిళితం చేయడానికి చూడగా.. అదే సరిగా కుదరలేదు. రోషన్ మేక ఆ ఫుట్ బాలర్ పాత్రలో చక్కటి నటన కనబర్చినప్పటికీ.. ఆ కథలో అతడి పాత్ర ఇమడలేకపోయింది. ‘ఛాంపియన్’ కచ్చితంగా ఒక భిన్నమైన.. మంచి ప్రయత్నం. కానీ ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ కావడంతో‘ఛాంపియన్’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
చారిత్రక ఘటనల మీద సినిమాలు తీసినపుడు డ్రామాను రక్తి కట్టించడం కోసం.. కొన్ని కల్పిత పాత్రలు.. సన్నివేశాలను జోడించడం మామూలే. కానీ వాటిని వాస్తవ కథలో మిళితం అయ్యేలా చూసుకోవడం కీలకం. ఇక్కడే దర్శకుడు ప్రదీప్ అద్వైతం తడబడ్డాడు. క్లైమాక్సులో రజాకార్ల మీద బైరాన్ పల్లి వాసులు వీరోచితంగా పోరాడే ఎపిసోడ్ ఆకట్టుకుంది కానీ ఆ ఎపిసోడ్‌లో హీరో మాత్రం ఉండడు. ఈ కథ నుంచి హీరో సైడ్ అయిపోయాడనే భావన కలుగుతుంది. చివరికి హీరో పెద్ద త్యాగం చేసినా.. ఎలాంటి భావోద్వేగం కలగలేదంటే.. ఆ పాత్ర ఈ కథలో సింక్ కాలేదనే అర్థం. మిక్కీ జే మేయర్ నేపథ్యం సంగీతంతో పాటు పాటలు అలరించాయి. మొత్తానికి ‘ఛాంపియన్’ మంచి ప్రయత్నమే కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.