స్త్రీ ద్వేషంపై నిరసనలు ఎప్పుడూ బహిరంగంగా, హింసాత్మకంగా ఉండవు. చాలాసార్లు అవి నిశ్శబ్దంగా ఉంటాయి. ఒక అమ్మాయి తన నిరనస తెలిపేందుకు చెయ్యి పైకెత్తి, మరుక్షణంలో తాను తప్పు చేస్తున్నామోననే భయంతో ఒక్క క్షణం ఆగితే అందుకు కారణం ‘అతిగా చెయ్యకు’ అంటూ చిన్నప్పటినుంచీ ఆమెకు పెద్దలు చెప్పిన ‘సుద్దులు’ కారణం కావచ్చు. తమకు నచ్చని విషయాన్ని స్పష్టంగా చెప్పలేక తమలోతాము కుమిలిపోయే అమ్మాయిలు సమాజంలో లేకపోలేదు. చాలామంది అమ్మాయిలు ఇతరుల సౌకర్యం కోసం తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో పాఠాలు వింటూ పెరుగుతారు. ‘మర్యాదగా ఉండు. అన్నిటికీ తల ఊపద్దు. ఎక్కువగా వాదించొద్దు. ఎక్కువగా నవ్వకు’.. ఇలాంటి పాఠాలు ఏమీ హాని చేయనివిగా పైకి అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా అవి.. ‘విషయాలను సులభతరం చేయడమే నీ పని. ఎక్కువగా చొరవ తీసుకోవడం కాదు’ అనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. అదే సమయంలో అబ్బాయిలలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తారు. వారి విజయాల్ని పండుగలా జరుపుకుంటారు. అదే తరహాలో మహిళలు ఆత్మవిశ్వాసాన్ని కనబరిస్తే, నిలదీస్తారు.. విమర్శిస్తారు. ఈ అసమతుల్యత ప్రమాదవశాత్తు చోటు చేసుకునేది కాదు, చిన్నప్పటినుంచే ఉగ్గుపాలతో నేర్పేదే.
కొన్ని సందర్భాలలో స్త్రీ ద్వేషం అనేది గోరంత మాత్రమే అనిపిస్తుంది కానీ, అది మనపై శాశ్వతమైన ముద్ర వేస్తుంది. దానిపై యథాలాపంగా మాట్లాడి వదిలేయడం, మీ బాధను అతిశయోక్తిగా తోసిపుచ్చడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఏం చెబుతున్నా లేదా చేస్తున్నా వాటికంటే మీరు ఎలా కనిపిస్తున్నారనే దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమూ కద్దు. ఇలాంటివన్నీ కలగలసి.. మహిళలు తామెంత సమర్ధులైనప్పటికీ, తెలివైనవారు అయినప్పటికీ తమను తాము అనుమానించుకునేలా చేస్తాయి. ఇదొక అలవాటుగా మారుతుంది.
విచారకరమైన విషయం ఏమింటటే స్త్రీ ద్వేషం అనేది పైకి అతి సాధారణమైనదిగా కనిపించడం. చాలామంది మహిళలు దానిని సరిగ్గా గుర్తించరు కూడా. దానికి అలవాటు పడి జీవించడం నేర్చుకుంటారు. తమను బాధపెట్టే వ్యాఖ్యలకు సైతం నవ్వుతారు. తమ కోపాన్ని అణచుకుంటారు. అసభ్యకరమైన ప్రవర్తనను సైతం భరిస్తారు. ఎందుకంటే అలాంటి సంఘటనలగురించి మాట్లాడితే ఇతరులు ‘నాటకీయత’గా ముద్రవేస్తూ ఉంటారు. అందుకే, తమ మనుగడకు మహిళలు మౌనమే దారి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. స్వీ ద్వేషం కేవలం మహిళలనే కాదు, అందరినీ కట్టడి చేస్తుంది. మహిళలను కట్టడి చేస్తే వారి విలువైన అభిప్రాయాలను సమాజం కోల్పోతుంది. అమ్మాయిలను అదుపుచేస్తే వారి నాయకత్వాన్ని, ఆవిష్కరణలను నష్టపోతుంది. వారి భావోద్వేగాలను బలహీనతలుగా కొట్టిపారవేస్తే సానుభూతికి విలువే లేకుండాపోతుంది. అసమానతలపై నిర్మించిన ప్రపంచం అభివృద్ధికి నోచుకోదు.
మార్పు గొప్ప ప్రసంగాలతో ప్రారంభం కాదు. వాటిని ఆకళింపు చేసుకోవడంతోనే ప్రా రంభమవుతుంది. మహిళలు తమ అనుభవాల గురించి మాట్లాడినప్పుడు వారిని నమ్మాలి. త మను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేసేవారిని, తమ అలవాట్లు, సాంప్రదాయాలను హేళన చేసే విధంగా మాట్లాడేవారిని నిలదీయాలి. గౌరవం అనేది లింగ వివక్షకు లోబడి ఉండదని, ఆత్మవిశ్వాసం అనేది ఓ వర్గానికి మాత్రమే పరిమితమైనది కాదని పిల్లలకు బోధించాలి. స్త్రీ ద్వేషం అనేది అందరికీ సంబంధించిన సమస్య. అది మనిషి జ్ఞాపకాలలో, బయటకు చెప్పుకోలేని ఆలోచనలలో జీవిస్తుంది. దీనిని సవాలు చేయడం అంటే, ఎవరూ తమను తాము తగ్గించుకోవాల్సిన అవసరం లేని ఒక ప్రపంచాన్ని సృష్టించేందుకు వేసే ముందడుగు.
– శ్రీనిక లింగాల
(7 వ తరగతి విద్యార్ధిని)