మన తెలంగాణ/హైదరాబాద్: పంచాయతీలకు ఎన్నికలు పూర్తయి కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టిన సంతోషం ఒక వైపు ఉంటే, లక్షలు, కో ట్లాది రూపాయల పాత బకాయిల చెల్లింపు వారికి ప్రతిబంధకంగా మారింది. ఇటీవల బాధ్యతలు చే పట్టిన పాలక వర్గాలు ఎన్నికల్లో గెలుపు కోసం లెక్కలేనన్ని హామీలు ఇవ్వడమే కాకుండా, కోట్లలో నే ఖర్చు చేసి పదవులు దక్కించుకున్నారు. గెలిస్తే చేసే అభివృద్ధి పనుల హామీలకే నిధులు పెద్ద ఎత్తు న అవసరం అవుతాయి, అటువంటిది పాత బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిధులు లేక చిన్న చిన్న పనులు సైతం చేపట్టే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం నిరీక్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అడపాదడపా నిధులు మంజూరు చేస్తున్నా అవి పెండింగ్ జీతాలు, ఇతర పనులకే సరిపోతున్నాయి. అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఒక వైపు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి సర్పంచ్‌లు చేసిన పనులకు చెల్లించాల్సిన బకాయిలే కాకుండా గత 19నెలల నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీల్లో నిధులు లేక ఆయా కార్యదర్శులు సొంత నిధులతో నిత్యం జరిగే పనులకు వినియోగించిన మొత్తం కలిపి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతోంది. గత సర్పంచ్‌లు చేసిన పనులకు ఎంబీ రికార్డులు నమోదు చేశారు, ఆ పనులకు కూడా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో కొత్త సర్పంచ్‌లు ఏ చిన్న పని చేయాలన్నా నిధుల కొరత ఇబ్బందిగా మారింది. కేంద్ర నిధులు వచ్చి నా, రాష్ట్ర నిధులు వచ్చినా ముందు పాత బకాయి లు చెల్లించాకే, కొత్త పనులు చేయాల్సి ఉంటుంద ని అంటున్నారు. ఇదిలావుంటే పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధుల కన్నా పాత బకాయిలకు చెల్లించాల్సిందే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోం ది.
కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్పంచులకు చెల్లించ వలసిన బకాయిలు సుమారు రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉందని, అలాగే ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు చేసిన ఖర్చులకు కూడా దాదాపుగా రూ.300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే అమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఇదివరకు సర్పంచ్‌లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. బిఆర్‌ఎస్ పాలనలో ఆ ప్రభుత్వ ఒత్తిడి మేరకు సర్పంచ్ లు అప్పులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి పను లు చేపట్టారు. ప్రభుత్వం మారి, పదవీ కాలం ము గిసి దాదాపు ఏడాదిన్నర గడిచినా బిల్లుల చెల్లింపు సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తమ జీవితాలు అప్పులపాలై రోడ్డున పడుతున్నాయని మాజీ సర్పంచ్‌లు రాష్ట్ర సచివాలయం ముందు ధర్నా కూడా చేశారు. సర్పంచ్‌ల సంఘాలు ప్రభుత్వాన్ని చాలా సార్లు ఈ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌ల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 2తో ముగిసింది. ఆనాటి సర్పంచ్‌లకు గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులకు గాను సుమారుగా రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రభుత్వం బకాయి పడింది. ఇవన్నీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1200 కోట్ల వరకు ఉంటుందని సర్పంచ్‌ల సంఘాలు చెబుతున్నాయి. ఈ నిధుల చెల్లింపు ప్రస్తుత కొత్త పంచాయతీ కార్యవర్గాలకు పెద్ద సవాల్‌గా మారింది. 2019- నుంచి 2024 మధ్య పని చేసిన సర్పంచ్‌లకు చేసిన పనులకు నిధులు విడుదల కాకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపైనా సర్పంచ్‌ల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి.
గుదిబండగా పంచాయతీ కార్యదర్శుల బకాయిలు
సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బకాయిలే కాకుండా పంచాయతీ కార్యదర్శులకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఒక్కో కార్యదర్శికి ఆయా పంచాయతీ స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సుమారుగా ఒక్కో జిల్లాకు రూ.10 కోట్ల వరకు కార్యదర్శులకు చెల్లించాల్సిన బకాయి ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో కార్యదర్శులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ప్రభుత్వం దశల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చినా చెల్లించలేదు. దీంతో దాదాపు రూ.380 కోట్లు కార్యదర్శులకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త పాలక వర్గాలకు ఇది రెండో సమస్యగా పరిణమించింది. దీంతో గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచ్‌లకు ఈ ఆర్థిక సవాళ్లు తలనొప్పిగా మారుతున్నాయి. రెండేళ్ల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో జీరో నిధుల నిల్వలు ఉన్నాయి. నిధులు లేక నిత్యం జరగాల్సిన పారిశుధ్య పనులు పడకేయడం, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి.
గ్రామాల్లో అంతర్గత రోడ్లు దెబ్బతినడంతో పాటు పైప్ లైన్ల లీకేజీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు కేవలం పారిశుధ్య కార్మికులకు మాత్రమే జీతాలు చెల్లిస్తూ వచ్చిన ప్రభుత్వం నిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా నిలిపి వేశారు. ఇవన్నీ పూర్తి చేయడం కొత్త సర్పంచ్‌లకు సరికొత్త సవాల్‌గా మారింది. గ్రామాల్లో వీధి లైట్లు, పైప్ లైన్ల లీకేజీల మరమ్మతులు, చెత్త తరలిపు ట్రాక్టర్లకు డీజిల్, బ్లీచింగ్ పౌడర్, సున్నం వంటి వాటిని కొనుగోలు చేసేందుకు కార్యదర్శులు తమ సొంత డబ్బు ఖర్చు చేశారు. అయితే కొత్త సర్పంచ్‌లు కార్యదర్శులకు చెల్లించాల్సిన బకాయిలను ఏవిధంగా చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. సగటున ఒక్కో కార్యదర్శి రూ.3 లక్షలు వెచ్చించినట్టు అంచనా వేసినా 12,769 గ్రామాలకు ఇలా సుమారుగా రూ.380 కోట్లు కార్యదర్శులకు రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచులు, కార్యదర్శులు డిమాండ్ చేశారు.
నిధుల్లేక గాడి తప్పిన పంచాయతీల పాలన
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రెండేళ్ల నుంచి తలసరి గ్రాంట్ రాలేదు. ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కొరికి రూ.165 చొప్పున ప్రతి గ్రామపంచాయతీకి తలసరి గ్రాంట్ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మూడు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదిలో నాలుగు సార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది. గత ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామాల్లో పాలకవర్గాలు లేని కారణంగా 2024-.25లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,514 కోట్లు నిలిచిపోయాయి. ఇకపోతే రెండేళ్ల నుంచి పీఎంఈవై, ఐఎఫ్‌ఎంఎస్, ఎస్‌ఎఫ్‌ఎస్, రాష్ట్ర గ్రాంట్ తదితర నిధులు కూడా విడుదల కాకుండా నిలిచిపోవడంతో దాదాపు పంచాయతీల్లో పాలన స్తంభించింది. గత 19 నెలల నుంచి గాడి తప్పిన పంచాయతీ పాలనను తిరిగి గాడిలో పెట్టడం అంటే ఆషామాషీ కాదని చెబుతున్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా పాత బకాయిలకే సరిపోతే మరి పాలన ఎలా..?, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ఎలా చేపడతారనే కోణంలో పలువురు కొత్త పాలక వర్గాలను ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే గత రెండేళ్లుగా పాలకవర్గాలు లేని కారణంగా 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోయిన నిధులు ఎప్పుడు విడుదల అవుతాయో స్పష్టత లేదు. ఫలితంగా వంద రూపాయల పనికైనా నిధులు లేని నిస్సహాయ స్థితిలో పంచాయతీలు ఇబ్బందిపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కో పంచాయతీకి కనీసం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రావాల్సిన నిధులు ఎప్పుడు విడుదలవుతాయోనని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.