14 ఏళ్ల వయస్సులోనే క్రికెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఏ టోర్నమెంట్ అయినా.. తనదైన మార్క్ ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపిఎల్‌తో ప్రారంభమైన అతడి జైత్రయాత్ర ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ వరకూ కొనసాగుతూనే ఉంది. టోర్నమెంట్‌లో భాగంగా బీహార్ తరఫున అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. ఈ క్రమంలో చాలా మంది వైభవ్‌ను టీం ఇండియాలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ కూడా చేరిపోయారు. వైభవ్ సూర్యవంశీని ఆయన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు.
అంతేకాదు అతడికి టీం ఇండియాలో చోటు ఇవ్వాలని కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లకు సూచిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘గతంలో 14 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. తర్వాత అతడు ఏ స్థాయికి చేరుకున్నారో అందరికీ తెలుసు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ కూడా టీం ఇండియా తరఫున ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు’’ అంటూ శశిథరూర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.