పెంచిన చార్జీలను ఈ నెల 26 శుక్రవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సబర్బన్, సీజన్ టికెట్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 215 కిలో మీటర్ల వరకు ఎటువంటి పెరుగుదల లేదు, 216 నుంచి 750 కి.మీ వరకు రూ.5, 751 నుంచి 1250 వరకు రూ.10 పెరిగిందని వెల్లడించింది. 1251 కి.మీ నుంచి 1750 వరకు రూ.15, 1751 నుంచి 2250 వరకు రూ.20 పెరిగినట్లు స్పష్టం చేసింది. అలాగే స్లీపర్ క్లాస్ ఆర్డినరీ కిలోమీటర్‌కు ఒక పైసా, ఫస్ట్‌క్లాస్ ఆర్డినరీకి కిలో మీటర్‌కు ఒక పైసా పెరిగింది. ఇక సెకండ్ క్లాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్‌లకు, స్లీపర్ క్లాస్‌కు, ఫస్ట్ క్లాస్‌కు కిలో మీటర్‌కు రెండు పైసలు చొప్పున పెరిగింది. ఏసి తరగతులకు సంబంధించి ఏసి చైర్ కార్, ఏసి 3 టైర్, 3ఈ, ఏసి 2 టైర్, ఏసి ఫస్ట్ క్లాస్ ఈసి, ఈఏల తరగతులకు కిలో మీటర్‌కు రెండు పైసల చొప్పున పెరిగిందని ద.మ.రై ఆ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న వారికి ఈ చార్జీల పెంపుదల వర్తించదని రైల్వే పేర్కొంది.