లఖ్ నవూ: ప్రపంచం మొత్తం బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యం చూసిందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ప్రజలందరి కృషితోనే వికసిత్ భారత్ సాకారం అవుతుందని అన్నారు. వాజ్ పేయీ జయంతి సందర్భంగా లఖ్ నవూలో జాతీయ ప్రేరణ స్థల్ ప్రారంభం చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్ పేయీ విగ్రహాలు, విగ్రహాలతో పాటు మ్యూజియాన్ని, రూ. 230 కోట్లతో 65 ఎకరాల్లో జాతీయ స్మారకం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లఖ్ నవూలో మోడీ మాట్లాడుతూ.. బ్రహ్మోస్ క్షిపణులు లఖ్ నవూలోనే తయారవుతున్నాయని, లఖ్ నవూలో అతిపెద్ద డిపెన్స్ కారిడార్ ఉందని తెలియజేశారు.
మొబైల్, ఇంటర్నెట్ వాడే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. భారత్ అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి దేశంగా 11 ఏళ్లలో మారిందని, మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంగా ఉందని ప్రశంసించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్ పేయీ విగ్రహాలు, గొప్ప స్ఫూర్తినిస్తాయని, డిసెంబర్ 25న ఇద్దరు మహనీయులు జన్మించారని అన్నారు. భారత ఏకత్వానికి వాజ్ పేయీ, మదన్ మోహన్ మాలవీయ కృషి చేశారని, ప్రజల ప్రతి అడుగు జాతి నిర్మాణం దిశగా ఉండాలని ప్రేరణస్థల్ సందేశం ఇస్తుందని సూచించారు. నేతల విగ్రహాలు ఎంత ఎత్తు ఉన్నాయో.. వాటి వల్ల కలిగే ప్రేరణ అంత కంటే గొప్పదని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ కలల సాకారానికి సంకల్పం తీసుకోవాలని మోడీ కోరారు.