బంగ్లాదేశ్ పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది. ఏణ్ణర్థం క్రితం అవామీలీగ్ అధినేత్రి, ఆ దేశ ప్రధాని షేక్ హసీనాపై ఉవ్వెత్తున లేచిన నిరసన జ్వాలలు ఆమెను కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోయేలా చేశాయి. తదనంతరం నోబెల్ బహుమతి విజేత మహ్మద్ యూనస్ తాత్కాలికంగా పగ్గాలు చేపట్టారు. అదుపు తప్పిన శాంతిభద్రతలను గాడిలో పెట్టడం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించడం, ఈ రెండు ప్రధాన లక్ష్యాలతో పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ పెద్దమనిషి, లక్ష్యసాధన దిశగా చేసింది శూన్యమని తాజా అల్లర్లు చెప్పకనే చెబుతున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టినది మొదలు దేశం హింస ప్రతిహింసలతో అట్టుడుకుతోంది. మైనారిటీలపై దమనకాండ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది అవామీలీగ్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీని గుర్తు తెలియని దుండగులు హతమార్చడంతో బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమంది.
ఆందోళనకారులు పత్రికా కార్యాలయాలకు నిప్పంటించడమే కాకుండా, బంగ్లా జాతిపిత ముజిబుర్ రహ్మాన్ నివాసంపైనా మరోసారి దాడి చేశారు. భారత వ్యతిరేకిగా ముద్రపడిన హాదీ హత్యకు ప్రతీకారంగా ఆందోళనకారులు దీపూ చంద్రదాస్ అనే మైనారిటీ వర్గానికి చెందిన యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో మైనారిటీల భద్రత ప్రమాదపుటంచులకు చేరింది. చివరకు ఇరు దేశాలూ వీసా సేవలను నిలిపివేసే స్థితికి పరిస్థితులు విషమించాయి. ‘హిందువులు కనిపిస్తే చాలు, అక్కడి ప్రజలు ఎంతమాత్రం వదిలిపెట్టేలా లేరు. చివరకు మేం మా పేర్లు మార్చుకుని బయటపడవలసి వచ్చింది’ అంటూ ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ దేశానికి వెళ్లి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగొచ్చిన ఓ తబలా వాద్యకారుడి మాటలు వింటే, బంగ్లా దేశీయుల్లో భారత వ్యతిరేకత ఎంతలా పెరిగిపోయిందో అర్థమవుతుంది. నిన్నటివరకూ మిత్రదేశాలుగా కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ నేడు ఉప్పూనిప్పూలా మారడానికి ప్రధాన కారణం యూనస్ ప్రభుత్వ వ్యవహార శైలేనంటే సందేహం లేదు. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందన్నట్లు రాజకీయ పాలనానుభవం ఏమాత్రం లేని తాత్కాలిక ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తూ, తన చేష్టలతోనూ, వ్యాఖ్యలతోనూ అల్లర్లకు ఆజ్యం పోస్తోంది.
హాదీ హత్యలో ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలు ప్రభుత్వానికి సిగ్గుచేటు. తన సోదరుడిని హత్య చేసి, తద్వారా చెలరేగిన అల్లర్లను సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయడం ప్రభుత్వం ఎత్తుగడ అని స్వయంగా హతుడి సోదరుడే ఆరోపించడం గమనార్హం. పొరుగు దేశంలో పెరుగుతున్న భారత వ్యతిరేక వైఖరిని కేంద్ర ప్రభుత్వం ఓ కంట కనిపెడుతోంది. భారత్ తో కోరి కయ్యానికి కాలు దువ్వుతూ, అటు పాకిస్తాన్, చైనాకు దగ్గరయ్యేందుకు బంగ్లా ప్రభుత్వం పావులు కదపడం ఒకింత ఆందోళనకరమే. అంతకుమించి, బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింసాకాండ కారణంగా భారత్‌లోకి వలసలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే అలజడులతో అల్లకల్లోలంగా ఉన్న కొన్ని ఈశాన్య రాష్ట్రాలపైనా ఈ ప్రభావం ఉండకపోదు. ఇరు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్ల పొడవునా ఉన్న సరిహద్దుల వెంబడి అశాంతి వాతావరణం చోటు చేసుకుంటే అది ఇరు దేశాలకూ తలనొప్పే.
ఈ నేపథ్యంలో భారత్‌తో విభేదాలు కొనితెచ్చుకోవాలనుకోవడం లేదంటూ బంగ్లా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు విశ్వసించదగినవిగా కనిపించడం లేదు. తాను పదవిలోకి రాగానే అవామీలీగ్ పై నిషేధం వేటు వేయడంతో అప్పటికే కొనసాగుతున్న అల్లర్లకు యూనస్ ఆజ్యం పోసినట్లయింది. ఈ నిర్ణయంతో దేశంలోనే అతి పెద్ద పార్టీగా చెలామణి అవుతున్న అవామీ లీగ్ కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడి ఉంటే, ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలే తిరస్కరిస్తారు కదా. తన చేతులకు మట్టి అంటకుండా రాజకీయ చతురతను ప్రదర్శించే విషయంలో యూనస్ విఫలమయ్యారు. పైపెచ్చు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురాలేకపోవడంతో ఎన్నికల నిర్వహణలో అలవిమాలిన జాప్యం ఏర్పడింది. గాడితప్పిన పాలనను తిరిగి పట్టాలెక్కించేందుకు, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు తనకు లభించిన సువర్ణావకాశాన్ని జారవిడిచుకున్న యూనస్ ఇక చేయవలసింది ఒక్కటే.. ఫిబ్రవరిలో జరగవలసిన ఎన్నికలనైనా సజావుగా నిర్వహించి, గెలిచిన పార్టీకి ప్రజాతీర్పు మేరకు పాలనా పగ్గాలను అప్పగించడం.