అమరావతి: స్మృతి వనాన్ని ఏర్పాటు చేద్దామంటే తప్పనిసరిగా చేద్దామన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్. మాధవ్ తెలిపారు. యాత్రకు అన్ని విధాలా సంపూర్ణ మద్దతు ఇస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతిని పురస్కరించుకుని.. వెంకటపాలెం సమీపంలో 13 అడుగుల వాజ్ పేయీ కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతి మచ్చలేని వ్యక్తిగా జీవించడం చాలా కష్టమని, ప్రపంచంలోనే వాజ్ పేయీ వంటి నేత ఉండటం అరుదని మాధవ్ కొనియాడారు. అమరావతిలో సుపరిపాలన కేంద్రం కూడా ఉండాలని సిఎంను కోరుతున్నామని, ప్రతి జిల్లాలో వాజ్ పేయీ విగ్రహావిష్కరణ చేపట్టామని తెలియజేశారు. విగ్రహావిష్కరణ ఆలోచన రాగానే చంద్రబాబు వద్దకు వెళ్లానని, తమకు కూడా అత్యంత ఇష్టమైన నాయకుడు వాజ్ పేయీ అని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. కూటమి నేతలంతా సహకరిస్తామని.. చంద్రబాబు మద్దతిచ్చారని మాధవ్ స్పష్టం చేశారు.