ప్రజాస్వామ్య సౌధం నాలుగు స్తంభాలపై నిలిచి ఉంది. చట్టసభలు, కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస, మీడియా. ఈ నాలుగు స్తంభాలలో ముఖ్యమైన చట్టసభలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్, ప్రభుత్వాలదే. ముఖ్యంగా లోక్‌సభ శాసనసభలకు ఐదేళ్లకొకసారి లేదా కాస్త ముందుగా గాని ఎన్నికలు నిర్వహిస్తుండగా మిగిలిన స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారు. ఐదేళ్లు నిండిన తర్వాత వీటికి ప్రత్యేక అధికారులు నియమించి పాలన సాగిస్తున్నారే కానీ ఏదో ఒక కుంటిసాకుతో వాటికి ఎన్నికలు జరపడం లేదు. ఫలితంగా వాటికి రావలసిన కేంద్ర నిధులు విడుదల కాక అభివృద్ధి పడకేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఏదో విధంగా అబద్ధపు ప్రచారాల తోనూ, అలవికాని హామీలతోనూ ఓటర్లను ఆకర్షించవచ్చు. తమ ఓటు షేర్ పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. అధికార పక్షం బలప్రదర్శనకు, అంతో ఇంతో అధికార దుర్వినియోగానికి మంచి అవకాశం. కాగా ప్రతిపక్షాలకు విమర్శల బాణాలు సంధించడానికి, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే దానికి సువర్ణ అవకాశం. పోటీ చేసే అభ్యర్థులకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి ఫలితాల ప్రకటన వరకు గొప్ప టెన్షన్. తెగించి ఖర్చు చేస్తున్నా అందుకు అనుకూలమైన ఫలితం వస్తుందో లేదో అన్న ఆందోళన వారిని ఆవహించి ఉంటుంది.
ఎన్నికల కమిషన్ కంటపడకుండా ఖర్చు చేయాలి. అందరినీ ‘సంతృప్తి’ పరచుకుంటూ పోవడం అతడికి అత్యవసరం. ఈ మహా ప్రక్రియలో చివరి బకరా ఓటరు. ఆశించి భంగపడటం అతడి నైజం. అందుకే ఈ మధ్య అభివృద్ధి జరుగుతుందని, తమ జీవితాలు బాగుపడతాయని సగటు ఓటరు విశ్వసించడం లేదు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చే సొమ్మునే ఆశిస్తున్నాడు, దానికి ఆశపడుతున్నాడు. మన వ్యవస్థలో ఎన్నికల అక్రమాలు, నిబంధనల అతిక్రమణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోటీ అభ్యర్థులను బెదిరించడం, లొంగదీసుకునే ప్రయత్నం చేయడం, కొంతమంది అభ్యర్థులతో లోపాయకారి ఒప్పందాలు నేటి ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు రోజు జరిగే అక్రమాలకు, దుర్మార్గాలకు అంతులేకుండాపోయింది. పోలింగ్‌నాడు కూడా ఓటరుకు తన ఓటు తాను వేసేంతవరకు నమ్మకం లేదు. అంటే ప్రతిచోట ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుండగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతున్నది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతున్నది. జాతీయ స్థాయిలో కార్పొరేట్లు తమకు అనుకూలమైన ప్రభుత్వాల కోసం వందల వేల కోట్లు పార్టీలకు విరాళాలు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. గతంలో పెద్ద పదవులకు అంటే ఎంపి, ఎంఎల్‌ఎ లాంటి వాటికి విదేశాలలో ఉన్న వారు సైతం దేశానికి వచ్చి ఏదో ఒక పార్టీ టికెట్ సంపాదించి పోటీ చేయడం పదవులు అనుభవించడం మనకు అనుభవమే.
ఈసారి సర్పంచ్ ఎన్నికలకు అభ్యర్థులు విదేశాల నుండి ‘దిగుమతి’ అవుతున్నారు. కొంతమంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి లేదా పదవి విరమణ చేసి మరీ ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేశారు. అంటే వారికి ‘సేవా తత్పరత’ ఎక్కువవుతున్నది. మాతృభూమిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు వారు చెప్పుకోవడం సంతోషమే. కానీ అది ఐదేళ్ల తర్వాత ఆ గ్రామ ప్రజలు ఇవ్వవలసిన తీర్పు మాత్రమే. మన దగ్గర మహిళా అభ్యర్థులు పదవులకు ఎంపికైనా కానీ వారి ‘మగమహారాజు’లే పరిపాలిస్తుంటారు. అనధికార పరిపాలకులుగా చలామణి అవుతుంటారు. పదవులు మహిళలకు, అధికారాలు వారి భర్తలకు. కొన్ని సందర్భాలలో సమావేశాలకు సైతం వారి భర్తలే హాజరై చర్చల్లో పాల్గొంటూ నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించడం శోచనీయం. మాటల్లోని మహిళాభ్యున్నతి గడప దాటడం లేదు. తరతరాలుగా జీర్ణించుకొని పోయిన పురుషాధిక్యం సమాజంలో మహిళలకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచుతూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. కొన్నిచోట్ల దళిత గిరిజన సర్పంచులపై ఆ గ్రామంలోని ఆధిపత్య కులాలు తమ పెత్తనం చెలాయిస్తుండటం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తమ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ఇతర నియోజకవర్గాలను చిన్నచూపు చూస్తారు లేదా నిర్లక్ష్యం చేస్తారు. వీరు రాష్ట్రం మొత్తానికి లేదా దేశం మొత్తానికి బాధ్యులు అనే విషయం మరవడం బాధాకరం.
పదవి స్వీకారం నాడు ఏ వ్యక్తికి, ప్రాంతానికి అనుచితంగా లేదా పక్షపాతంతో వ్యవహరించబోమని దైవసాక్షిగా ప్రమాణం చేస్తారు. ప్రజలు ప్రశ్నించడం మానుకున్నారు. ప్రశ్నించిన వాడి ఉనికి ప్రశ్నార్థకమవుతున్నది. అందుకే అవినీతికి అంతులేకుండా పోతున్నది. న్యాయం అందడానికి, పొందడానికి కాలము, డబ్బు ఖర్చవుతున్నాయి. సామాన్యుడి సహనానికి పరీక్షగా మారింది. రాజకీయాలలో డబ్బు జోక్యం ఎక్కువైంది. అందుకే గతంలో లాయర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, సంఘ సంస్కర్తలు రాజకీయాలు నడపగా నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, నేరచరితులు రాజకీయాలను ఆక్రమించారు, విలువలను పాతరేశారు. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కూడా రాజకీయాల పట్ల ఆకర్షితులవుతున్నారే కానీ వాటిని ప్రక్షాళన చేయలేకపోతున్నారు. అందులో విజయం సాధించలేకపోతున్నారు. రేపటి తరానికి దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు లాగా ఒక నిర్దిష్టమైన అర్హత లేకపోవడం ఈ వ్యవస్థ దురదృష్టం. ఓటుకు ఈసారి గిరాకీ మరీ పెరిగింది. దూరతీరాలలో ఉన్న వారు సైతం తమ సొంత ఊరుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అభ్యర్థుల ఖర్చుతో. ఒక పెద్ద మనిషి ప్రత్యేకించి విదేశాల నుండి విమానంలో విచ్చేసి తన హక్కును కాపాడుకొని ఓటు విలువ తెలియజేశాడు. నిన్నమొన్నటి ఎన్నికలలో ఒకచోట ఒక ఓటు విలువ 40 వేలు పలికినట్లుగా చదివాం. కొన్ని చోట్ల కోట్లు చేతులు మారుతున్నట్టుగా చదువుతున్నాం. అంతో ఇంతో ఈ దేశంలో ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టిఎన్ శేషన్ సదాస్మరణీయుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో జిల్లాకు ఒక శేషన్ కూడా సరిపోడేమో! ఆ పిల్లిమెడలో గంటకట్టేది ఎవరో? ఆశగా ఎదురు చూద్దాం. ఇక గ్రామాల్లో శాంతి నెలకొంటుందని, అవి అభివృద్ధి పథంలో సాగుతాయని కోరుకుందాం.
శ్రీశ్రీ కుమార్
94403 54092