లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సమీపంలో ఓ టీచర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎబికె హైస్కూల్‌లో దనిష్ రావు అనే ఉపాధ్యాయుడు కంప్యూటర్ సైన్స్‌లో పాఠాలు చెబుతాడు. గత 11 సంవత్సరాల నుంచి ఎబికె స్కూల్‌లో టీచర్‌గా ధనిష్ పని చేస్తున్నాడు. గత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇద్దరు సహోద్యోగులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వారిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆపారు. దనిష్‌పై తుపాకీలో మూడుసార్లు కాల్పులు జరిపారు. రెండు సార్లు తలపై కాల్పులు జరపడంతో టీచర్ దనిష్ కిందపడిపోయాడు. వెంటనే అతడిని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందారని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు స్థానిక సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి మెరుగుపడిందని చెప్పిన కొన్ని గంటల్లోనే కాల్పులు కలకలం సృష్టించాయి. యుపిలో శాంతి భద్రతల సమస్య ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. యుపిలో అత్యాచారాలు, మర్డర్లు రోజు రోజుకు పెరుగుతున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాకులు ఎక్కడ నుంచి వస్తున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యుపి, బిహార్ లాంటి రాష్ట్రాలలో గన్ కల్చర్ పెరిగిపోతుందని వాపోతున్నారు.