రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టిఎస్‌ఎల్‌పిఆర్‌బి)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు పోస్టుల వివరాలు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌లోట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ(టిఎస్‌టి), మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ (ఎంఎస్‌టి) పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నామన్నారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీకి 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీకి 114 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ రెండు వర్గాల పోస్టులకు నెలవారీ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉంటుందని వివరించారు. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ధరాఖాస్తు ఫారాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని, అర్హతలు, నింబధనల ప్రకారం అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.