విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీల మోత
మన తెలంగాణ/ క్రీడా విభాగం: భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అసాధారణ ఆటతో ప్రపంచ క్రికెట్‌లోపెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. టెస్టులు, టి20 ఫార్మాట్‌లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ పరుగుల వరద పారించాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లి దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇటు రోహిత్ అటు కోహ్లి సెంచరీలతో చెలరేగి పోయారు.
ఈ ఇన్నింగ్స్‌లతో తమలో జోష్ తగ్గలేదని మరోసారి నిరూపించారు. అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్న రోహిత్, కోహ్లిలు రానున్న వన్డే ప్రపంచకప్‌లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారనే చెప్పాలి. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మరిన్ని మ్యాచ్‌లు ఆడాలనే లక్షంతో రోహిత్, కోహ్లిలు ఉన్నారు. ఇందులో రాణించడం ద్వారా రానున్న రోజుల్లో జట్టులోస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే న్యూజిలాండ్ సిరీస్‌లో చెలరేగేందుకు రోకోలు సిద్ధమయ్యారు. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరూ రానున్న సిరీస్‌లలో మరింత మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నారు.
కొంతకాలంగా రోహిత్, కోహ్లిలపై వరుస విమర్శలు చేస్తున్న వారికి వీరిద్దరూ తమ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తున్న రోకోలు తమలో చేవ తగ్గలేదని నిరూపించారు. వీరిద్దరి బ్యాటింగ్‌ను గమనిస్తే రోకోలను జట్టు నుంచి తప్పించే సాహసం ఇటు ప్రధాన కోచ్ గంభీర్ కానీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేయరనే చెప్పాలి. ఒకవేళ వీరిని తప్పించాలని చూస్తే వారి పదవులకే ప్రమాదం ఏర్పడినా ఆశ్చర్యం లేదు.