నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. పలువురు స్టార్‌లు ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ అంచనాలను బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి రెట్టింపు చేశారు.
పార్ట్ 1లో పలు భాషలకు చెందిన అగ్రతారలు అతిథి పాత్రలో మెరిశారు. కనిపింది కాసేపే అయినా.. సినిమాపై తమదైన మార్క్ వేశారు. ఇప్పుడు జైలర్ 2కి కూడా ఇదే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతున్నారు దర్శకుడు నెల్సన్. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జైలర్ 2 అద్భుతంగా రాబోతోందని అన్నారు. ఇందులో మోహన్‌లాల్, షారుక్ ఖాన్, రమ్యకృష్ణ, శివ రాజ్ కుమార్‌లు అతిథి పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. దీంతో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇందులో ఉన్నట్లు ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లైంది.