బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆయన నివాసంలో రాష్ట్ర డిప్యూటీ సిఎం డికె శివకుమార్ గురువారం భేటీ కావడం ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న పోటీపైనే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భేటీ తరువాత శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి రాజకీయాలపై చర్చ జరగలేదని, డిసెంబర్ 27న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో కొత్త ఉపాధి పథకం గురించి పార్టీ అధ్యక్షునితో ఆలోచనలు పంచుకోవడమైందన్నారు. పార్టీ కార్యకర్తగానే తాను ఉంటానని ప్రకటించడంపై ప్రశ్నించగా దీని అర్థం పదవులు, లేదా ఉన్నత స్థానాలతో సంబంధం లేకుండా జీవితకాలం సభ్యునిగా పార్టీకి సేవ చేయడమేనని వివరించారు. తాను చేసిన కష్టానికి ఎప్పుడు తగిన ప్రతిఫలం పొందుతారు? అన్న ప్రశ్నకు అలాంటి వాటికి సమాధానం ఇవ్వలేనన్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసం గత కొన్నాళ్లుగా జరుగుతున్న కుమ్ములాటపై ఖర్గే ఇదంతా స్థానిక నాయకత్వ సమస్యే తప్ప పార్టీ అధిష్ఠానానికి కాదని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించగా, సీనియర్ నేతగా ఆయన తన మార్గదర్శకం చేశారని శివకుమార్ వివరించారు. డిసెంబర్ 19తో శాసనసభ సమావేశాలు ముగిసిపోయిన తరువాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, డిప్యూటీ సిఎం శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఢిల్లీకి పిలుస్తుందని పార్టీలో ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్నారా అని అడగ్గా, అలాంటి ప్లానులేవీ లేవని ఏదైనా పని ఉన్నా, లేదా పార్టీ అధిష్టానం రమ్మని పిలిచినా వెళ్తానన్నారు.
కేంద్రం ఎలాంటి చర్చ లేకుండా కొత్త ఉపాథి పథకం అమలు చేయడంపై చేపట్టనున్న ఆందోళనలకు సంబంధించి డిసెంబర్ 27న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానున్నది. ఈ పథకం గురించి శివకుమార్ మాట్లాడుతూ పోరాటం సాగించడానికి సిద్ధమవుతున్నామని, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా తాను భారీ ఉద్యమాన్ని చేపట్టాలని ఆలోచిస్తున్నానని చెప్పారు. అన్నిపంచాయతీల సభ్యులు ,ఎంజిఎన్‌ఆర్‌జిఎ కార్యకర్తలు దీనికి కలిసి రావాలని,మళ్లీ గ్రామీణ ఉపాధి పథకం పునరుద్ధరించబడుతుందని, గ్రామీణాభివృద్ధికి రక్షణ కలుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.