ఢాకా: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వాయిదాకే ఇస్లామిక అతివాద నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య జరిగిందా? తాత్కాలిక ప్రభుత్వ సారధి ముహమ్మద్ యూనస్ వర్గీయులే వ్యూహం ప్రకారం తన సోదరుడిని చంపించారని ఉమర్ హాదీ గురువారం ఆరోపిచారు. పలు కారణాలతో ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని యూనస్ గుర్తించారు. అందుకే ఎన్నికల విషమ పరీక్ష ఎదుర్కొవడంపై తలకిందులు అవుతున్నారు. యూసన్ మనుష్యులే తన సోదరుడిని చంపేశారని, దీని వెనుక పెద్ద రాజకీయం జరిగిందని ఉమర్ చెప్పారు.
ఢాకాలో జరిగిన ఇంక్విలాబ్ మార్చ్‌లో పాల్గొన్నప్పుడు ఉమర్ మాట్లాడారు. ఆయన స్పందన వెంటనే యూనస్‌కు హోం మంత్రిత్వశాఖపై ప్రత్యేక సహాయకుడు మహమ్మద్ ఖుదా బక్ష్ చౌదరి తమ పదవికి రాజీనామా ప్రకటించారు. హాదీని చంపించారు. పైగా ఆయన అంతాన్ని సాకుగా చేసుకుని ఎన్నికల రద్దుకు యత్నిస్తున్నారని, చేసిన పాపానికి ఎవరైనా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉమర్ అధికార వర్గంపై విరుచుకుపడ్డారు. తన సోదరుడిని మట్టుపెట్టిన వారందరిని బయటకు లాగాలని యూనస్‌ను డిమాండ్ చేశారు. లేకపోతే షేక్ హసీనా మాదిరిగా ఈయన కూడా దేశం విడిచిపెట్టి పారిపోవల్సి వస్తుందని హెచ్చరించారు. భారత విద్వేషిగా పేరొందిన హైదీని ఎవరో కాల్చి చంపిన ఘటన దేశంలో తీవ్ర స్థాయిలో అల్లర్లకు దారితీసింది. ఓ హిందూ వ్యక్తిని అత్యంత దారుణంగా హింసించి అల్లరిమూకలు తగులబెట్టి చంపేశారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఇంక్విలాబ్ ఉద్యమ నేత అయిన హాదీ కూడా ఓ అభ్యర్థిగా ఉన్నాడు.