టీం ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో 500+ పరుగులు చేసి ఇషాన్.. తన జట్టు జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించాడు. ఇప్పుడు వన్డే దేశవాళీ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కాడు. ఎలైట్ ఎ గ్రూప్‌లో కర్ణాటకతో జరిగిన పోరులో అద్భుత శతకం సాధించాడు. కానీ, ఇషాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జార్ఖండ్ జట్టుకు ఓటమి తప్పలేదు.
అయితే ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సుల సాయంతో 125 పరుగులు చేసిన ఇషాన్.. అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అతడు.. లిస్ట్ ఎ క్రికెట్‌లో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాక, మరో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు గతంలో శ్రీలంక బ్యాటర్ సంధున్ వీరక్కడి(39 బంతుల్లో) పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును ఇషాన్ బద్దలుకొట్టాడు.
అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ సెంచరీ చేసినా.. జార్ఖండ్ జట్టు ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు 412 పరుగులు చేసింది. అనంతరం కర్ణాటక 47.3 ఓవర్లలో చేధించింది. కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (118) విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.