భారతదేశంలో హిమాలయాల కంటే చాలా పురాతనమైన పర్వత శ్రేణి ఏదైనా ఉందంటే అది ఆరావళి మాత్రమే. ఆరావళి పర్వత శ్రేణులకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి వాయువ్య భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో 670 కి.మీ పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1,722 మీటర్లు. ఇవి ముడతపర్వతాలు. ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత వ్యవస్థలలో ఒకటిగా పేరుగాంచిన ఆరావళి పర్వతాలు ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నాయి. చట్టాలు, కోర్టులు, రాజకీయ ఆరోపణల మధ్య వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. హద్దు అదుపు లేని మైనింగ్ కారణంగా ఆరావళి పర్వతాలు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చడం వెనుక ఉద్దేశాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీం కోర్టు ఈ ఏడాది నవంబరు 20న కీలక తీర్పు ఇచ్చింది. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికిపైగా ఆరావళి పర్వతాలు, పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యనున్న భూమిని కూడా ఆరావళి పర్వతశ్రేణిగానే పరిగణిస్తారు. ప్రకృతి ఒడిలో వందల కిలోమీటర్ల ప్రయాణం, ఎన్నో జీవనదులకు జన్మస్థలం, విలువైన ఖనిజ సంపదకు మూలకేంద్రం ఆరావళి. 200 కోట్ల సంవత్సరాల వయసున్న ఈ పర్వత శ్రేణులు మానవజాతి చరిత్రలో ఎన్నో పరిణామాలకు సాక్షిగా నిలిచాయి.
వాయువ్యంగా 670 కిలోమీటర్ల పొడవున రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ పర్వతశ్రేణి ఉత్తర భారతదేశానికి ఒక రక్షణ గోడ లాంటిది. ఢిల్లీ సమీపంలో ప్రారంభమై అహ్మదాబాద్ వద్ద ముగుస్తుంది. రాజస్థాన్‌లోని మౌంట్‌అబూలో ఉన్న గురుశిఖర్ దీనిలో ఎత్తైన శిఖరం. ఈ పర్వతాలు థార్ ఎడారి విస్తరణను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అనేక నదులకు (బనాస్, లూనీ, సబర్మతి, సాఖీ) జన్మనిస్తాయి. రాగి, జింక్, సీసం, మార్బుల్ వంటి ఖనిజాలకు ఆరావళి ప్రసిద్ధి. తాజ్‌మహల్ నిర్మాణానికి వాడిన మక్రానా మార్బుల్ ఇక్కడి నుంచే సేకరించారు. భూగర్భ జలాల రీఛార్జ్, ఢిల్లీ చుట్టుపక్కల పర్యావరణ సమతుల్యతకు ఇవి చాలా కీలకం. అయితే, ఇంత గొప్ప చరిత్ర, పర్యావరణ ప్రాముఖ్యత ఉన్న ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చడంపై వివాదం ముసురుకుంది. ఆరావళి పర్వతశ్రేణుల్లో భారీ స్థాయిలో మైనింగ్‌కు అవకాశం కల్పించేందుకే ప్రభుత్వం నిర్వచనాన్ని మార్చిందని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. మైనింగ్ కార్యకలాపాలు విపరీతంగా పెరిగితే ఆరావళి తన సహజ స్వరూపాన్ని కోల్పోయి, ఆ ప్రాంతాలు, ప్రజల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని వారి ప్రధాన ఆందోళన.
ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. ఆరావళి పర్వతాల నిర్వచనంలో మార్పు మైనింగ్ కోసం కాదని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పర్వతాల రక్షణ కోసమేనని చెబుతోంది. గతంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిర్వచనం ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాలు మైనింగ్‌ను నిషేధిస్తే, మరికొన్ని అనుమతించాయి. ఈ పరిస్థితి మైనింగ్ మాఫియాకు అనుకూలంగా మారిందన్న విమర్శలున్నాయి. దీనిని పరిష్కరించడానికి గత ఏడాది ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, అన్ని రాష్ట్రాల్లో యూనిఫాం డెఫినిషన్‌ను అమలులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆరావళి పర్వతాలకు సంబంధించి 100 మీటర్ల ఎత్తు రూల్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నిర్వచనం ప్రకారం, పర్వత శ్రేణుల్లో 100 మీటర్ల కంటే తక్కువగాఉన్న ప్రాంతాన్ని ఆరావళిగా పరిగణించరు. దీంతో ఆ ప్రాంతాల్లో మైనింగ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుందని, మైనింగ్ మాఫియా ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా మైనింగ్‌కు తెరలేపే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి పరిస్థితులు రావని భరోసా ఇస్తోంది. మైనింగ్‌పై ఆంక్షలు కేవలం కొండ శిఖర భాగాలకు మాత్రమే పరిమితం కాదని, మొత్తం పర్వత శ్రేణులకు వర్తిస్తుందని చెబుతోంది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతం అసలు మైనింగ్‌కు పనికిరాదన్నది ప్రభుత్వ వాదన. పైగా, టైగర్ రిజర్వులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వెట్ ల్యాండ్స్, జీవవైవిధ్యానికి కీలకమైన కోర్ ఏరియాల్లో మైనింగ్ జరగదని స్పష్టం చేసింది. ఆరావళి నిర్వచనం మార్పు కారణంగా మైనింగ్ నిషేధించిన ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నది కేంద్రం గట్టిగా చెబుతున్న మాట. ప్రస్తుతానికి కొత్త మైనింగ్ లీజులపై సుప్రీం కోర్టు స్టే కొనసాగుతోంది. అక్రమ మైనింగ్ కేసులను కూడా విచారిస్తోంది. మొత్తం ఆరావళి ప్రాంతానికి సమగ్ర సస్టైనబుల్ మైనింగ్ ప్లాన్ తయారు చేయాలని గతంలోనే ఆదేశించింది. ప్రభుత్వం భరోసా ఇస్తున్నా, సుప్రీం కోర్టు పర్యవేక్షణ కొనసాగుతున్నా, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేయడానికి కారణాలున్నాయి. ఆరావళి నిర్వచనంలో చిన్న మార్పు కూడా భవిష్యత్తులో పెద్దస్థాయిలో దుర్వినియోగం కావడానికి దారితీయొచ్చు. చట్టాలు కాగితాలపై బలంగా ఉన్నా, అమలు బలహీనంగా ఉంటే పూడ్చలేని స్థాయిలో నష్టం జరగొచ్చు. ఒక్కసారి పర్వతాలు నాశనమైతే భవిష్యత్ తరాల జీవనం సమస్యగా మారిపోతుంది. అందుకే, మొత్తం ఆరావళి పర్వత శ్రేణుల్లో 0.19% మాత్రమే అధికారికంగా మైనింగ్ జరుగుతున్నా, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, ఒక్కసారి విధ్వంసం మొదలైన తర్వాత వినాశనమే తప్ప ఆరావళికి మళ్ళీజీవం పోయలేం. అందుకే, ఆరావళిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.
జి. సత్యనారాయణరాజు
94405 71617