టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు శతకాలు, 1 అర్థశతకం సాధించిన విరాట్.. 15 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఢిల్లీ జట్టు తరఫున అతడు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఆంధ్ర జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేశాడు.
ఇక కోహ్లీకి 58వ లిస్ట్-ఎ సెంచరీ కాగా.. ఇదే మ్యాచ్‌లో 16వేల లిస్ట్ ఏ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టులు, టి-20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించి.. కేవలం వన్డేల్లో మాత్రమే కోహ్లీ కొనసాగుతున్నాడు. అయినప్పటికీ.. ఏ మాత్రం జోరు తగ్గకుండా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఉన్న జోరునే విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చాలాకాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. ఎక్కడ కూడా అతడిలో తడబాటు కనిపించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్ కప్ టోర్నీ కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు’’ అని ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్మ అన్నారు.