వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట సహకార సంఘం వద్ద యూరియా కోసం మహిళా రైతులు క్యూ కట్టారు. సహకార సంఘానికి 400 బస్తాల యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో సహకార సంఘం దగ్గరకు వచ్చి క్యూలో నిల్చున్నారు. ఏవో శ్యామ్, రాజేష్, స్థానిక కానిస్టేబుల్ కుమార్ ఆధ్వర్యంలో క్యూలో నిల్చున్న రైతులకు టోకెన్లను వారి వద్ద ఉన్న కిసాన్ కార్డులకు ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేశారు. గతంలో యూరియా బస్తా తీసుకున్న వారికి మినహాయించి టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో కొంత మంది రైతులు ఎక్కువ యాసంగిలో పంటలు సాగుచేయడంతో ఎక్కువ యూరియా అవసరం అవుతుండగా కేవలం ఒక బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో పంటకు సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు ఈ సందర్భంగా వేడుకున్నారు.