కోస్గి: ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో సిఎం పర్యటించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సర్పంచ్‌లు ఇంటింటికీ వెళ్లి రేషన్ కార్డు రాని వారి పేర్లు రాసుకోవాలని సూచించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం రాని పేదల పేర్లు రాసుకోవాలని.. రైతు భరోసా అందని రైతుల వివరాలు సేకరించాలని అన్నారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కోటి మందికి ఇందిరమ్మ చీరలు.. నా ఆడబిడ్డలకు సారెగా ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు టిఫిన్‌తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
‘‘పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కెసిఆర్ సిఎం అయినా.. కొడంగల్‌కు నీళ్లు రానివ్వలేదు. పాలమూరు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. పదేళ్లలో కాంట్రాక్టర్లకు రూ.1.83 లక్షల కోట్ల బిల్లులు మాత్రం చెల్లించారు. కమీషన్ల రూపంలో రూ.వేల కోట్లు కెసిఆర్ కుటుంబం పొందింది. చెప్పులు లేకుండా తిరిగిన వాళ్లకు బిఆర్ఎస్ పాలనలో బెంజ్ కార్లు వచ్చాయి. మొత్తం రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి పోయారు. ఒకరికి ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ వచ్చింది. మరొకరికి జన్వాడలో వందెకరాల ఫాంహౌస్ వచ్చింది. కెసిఆర్ అల్లుడికి మొయినాబాద్‌లో ఫాంహౌస్ వచ్చింది. తెలంగాణలో కెసిఆర్ కుటుంబం మాత్రం బాగుపడింది. కెసిఆర్ కుటుంబానికి రూ.వేల కోట్ల వ్యాపారాలు వచ్చాయి’’ అని బిఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో రేవంత్ విమర్శలు చేశారు.
తాను ఉన్నంతకాలం కెసిఆర్‌కు అధికారం దక్కనివ్వనని సిఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించామని. ఇన్నిసార్లు ఓడించినా.. ఇంకా వాళ్లదే పై చేయి అంటారా? అని ప్రశ్నించారు. 2029లో అధికారం ముమ్మాటికీ కాంగ్రెస్‌దే అని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ బిడ్డగా ఇదే తన శపథం అని పేర్కొన్నారు.