హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ తెలిపారు. నేటి నుంచి హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..డిసెంబరు 31 రాత్రి హైదరాబాద్ లోని 100 ప్రాంతాల్లోని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయని, తనిఖీల్లో పట్టుబడితే వాహనాలు సీజ్, రూ.10 వేలు జరిమానా ఉంటుందని సజ్జనార్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష విధించబడుతుందని, తనిఖీల కోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. పబ్ లు, త్రీస్టార్, ఆపై హోటళ్లలో అర్థరాత్రి ఒంటిగంట వరకే అనుమతని.. మాదకద్రవ్యాలు, అశ్లీల నృత్యాలకు యజమానులదే బాధ్యతని సూచించారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లో మఫ్టీలో 15 షీ టీమ్స్ ఏర్పాటు చేశామని సిపి సజ్జనార్ పేర్కొన్నారు.