అలూర్: ప్రతిష్ఠాత్మకమైన విజయ్ హజారే దేశవాళి వన్డే క్రికెట్ టోర్నమెంట్‌కు బుధవారం తెరలేవనుంది. వచ్చే ఏడాది జనవరి 18 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 32 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. కర్ణాటకలోని అలూర్, బెంగళూరులతో పాటు అహ్మదాబాద్, రాజ్‌కోట్, జైపూర్ వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది. భారత క్రికెట్ బోర్డు కొత్తగా ప్రవేశ పెట్టిన నిబంధనల ప్రకారం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే ప్రతి ఆటగాడు ఈ టోర్నీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో ఈసారి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సహా సీనియర్, జూనియర్ ఆటగాళ్లందరూ విజయ్ హజారే ట్రోఫీలో ఆడక తప్పడం లేదు. కోహ్లి ఢిల్లీకి, రోహిత్ ముంబైకి ఆడనున్నారు.
సిరాజ్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, జడేజా, యశస్వి, షమి వంటి స్టార్ ఆటగాళ్లు ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. కాగా, నాకౌట్ పోటీలకు బెంగళూరులోని బిసిసిఐకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ స్టేడియం వేదికగా నిలువనుంది. నాలుగు క్వార్టర్ ఫైనల్, రెండు సెమీ ఫైనల్ పోటీలతో పాటు ఫైనల్‌కు కూడా ఈ గ్రౌండ్ వేదికగా నిలువనుంది. రానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బలమైన జట్టును తయారు చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త నిబంధనలు ప్రవేశ పెట్టింది. ఈ రూల్స్ ప్రకారం సీనియర్ ఆటగాళ్లు సయితం ఈ టోర్నీలో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతుండడంతో విజయ్ హజారే ట్రోఫీనిఎంతో ప్రాధాన్యత నెలకొంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి టోర్నీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.