హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ నగరంలో మాదకద్రవ్యాల వాడకాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పిఎస్ పరిధిలో హెచ్‌న్యూ (హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం) పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రేమ జంటతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల్లో ముగ్గురు పెడ్లర్లు, ఒక వినియోగదారుడు ఉన్నారు. వారి నుంచి 22 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి, 5 గ్రాముల ఎండిఎంఎ, 5.5 గ్రాముల ఎక్స్‌టసీ పిల్స్, 6 ఎల్ఎస్‌డి బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఇమాన్యుయేల్ కొండాపూర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సుస్మిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతడితో కలిసి ఉంటోంది. ఈ ప్రేమ జంట.. విలాసాలకు అలవాటు పడి మత్తు పదార్థాలను విక్రయిస్తోంది. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించి క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేపట్టారు. ప్రధాన సరఫరాదారు సాయి కుమార్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.