రాష్ట్ర డిజిపిగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. అర్హులయిన ఐపిఎస్ అధికారుల ప్యానెల్ లిస్టు పంపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డిజిపిగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాన్ని హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్తల టి. మధన్ గోపాల్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన డిజిపి నియామక ఉత్తర్వులు 2018 నాటి సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్‌కు పూర్తి వ్యతిరేకమంటూ పిటిషనర్ వ్యక్తిగతంగా హాజరై హైకోర్టులో వాదించారు. డిజిపి పదవి విరమణకు కనీసం 3 నెలల ముందుగానే యూపిఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం డిజిపి భర్తీ వివరాలను సమర్పించాల్సి ఉందన్నారు.అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపిఎస్సీకి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోర్టుకు తెలిపారు.
దాంతో శాశ్వత నియామక ప్రక్రియ ఆగిందని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. నిబంధనల ప్రకారం రెండు వారాల్లోగా అర్హులైన ఐపిఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి)కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్యానెల్ జాబితా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. యుపిఎస్‌సికి ప్యానెల్ లిస్టు పంపిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. డిజిపి నియామకంలో పారదర్శకత ఉండాలని, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించకూడదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.