ప్రపంచమంతా తెలిసిన లెజెండరీ అమెరికన్ పొలిటికల్ కార్టూనిస్ట్ జేమ్స్ టర్బర్. ఆయన ఒక్క కార్టూన్ వేస్తే, అనేక భాషల్లో 180 దినపత్రికల్లో వస్తుంది మర్నాడు. జేమ్స్ 90వ జన్మదినం రోజున అమెరికా అధ్యక్షుడు ఆయన ఇంటికి వెళ్లి పూలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాడు. అంత సూపర్ హీరో జేమ్స్‌ని ఒక అమెరికన్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఇంత పెద్ద ఆర్టిస్ట్ కదా మీకు ఏమన్నా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగాడు.
‘నేను పదో అంతస్తులో ఉంటాను, పొద్దున్నే లేచి కిటికీ తెరిచి దూరంగా ఉన్న కొండల్ని చూస్తూ ఉన్నప్పుడు నేను సీరియస్‌గా వర్క్ చేస్తున్నానని నా భార్యని జీవితాంతము నమ్మించలేకపోయాను’ అన్నాడాయన.
జేమ్స్ టర్బర్ చేస్తున్న వర్క్ ఏమిటి? ఆ రోజు వేయాల్సిన కార్టూన్ ఐడియా కోసం ఆలోచించడం… గింజుకోవడం. అలా కాదు ఇలా అని అనుకోవడం. అసలు కార్టూన్ వేయడానికి ఏం కావాలి? ఒక తెల్ల కాగితం నల్ల ఇంకు క్రోక్ విల్ లేదా బ్రష్ -బస్ అంతేగా. ఇవన్నీ ఉన్నంత మాత్రాన కార్టూన్ తోసుకు వచ్చేయదు. దానికి కావాల్సింది ఐడియా. రాష్ట్రము దేశ రాజకీయాల మీద గట్టి అవగాహన. మన వికారపు రాజకీయాల్ని వెక్కిరించి హేళన చేయగల సెన్స్ ఆఫ్ హ్యూమర్. దీంతోపాటు ఇందిరాగాంధీని అయినా, వైయస్ రాజశేఖర్ రెడ్డిని అయినా బాగా పోలికలు వచ్చేలా కొంచెం నవ్వు తెప్పించేలా కార్టూన్ బొమ్మలుగా వేయగల టాలెంట్ ఉండాలి. చురుక్కుమనిపించే చమత్కారంతో ఆ రోజు కార్టూన్ పండాలి. ఏ బహుత్ ముష్కిల్ హై అని చెప్పడమే నా ఉద్దేశం. జర్నలిస్టులు, కవులు, రచయితలు కొల్లలుగా ఉంటారు. పాటలు పాడేవాళ్లు వీధికో ఇద్దరు ఉంటారు. కార్టునిస్టులు మాత్రం చాలా అరుదు. అందులోనూ పొలిటికల్ కార్టూనిస్టులు అనేవాళ్లు రేరిస్ట్ ఆఫ్ ది రేర్. అలాంటి ఒక అమూల్యమైన అరుదైన కోవకు చెందినవాడు ఆర్టిస్ట్ మోహన్.
‘నీలాగా ఎన్టీరామారావును బొద్దుగా బుజ్జిగా బ్యూటిఫుల్ గా వేయగలిగే కార్టూనిస్టు ఇండియాలో ఎవరూ లేరు’ అని అన్నారు ప్రసిద్ధ కార్టూనిస్టు అబు అబ్రహం.
1950 డిసెంబర్ 24న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పుట్టాడు మోహన్. తండ్రి తాడి అప్పలస్వామి పేరున్న కమ్యూనిస్టు నాయకుడు అయినందువల్ల ఆ ఉద్యమాల్లోనే పెరిగాడు. గోర్కి అమ్మ నుంచి టోల్ స్టాయి అన్నా కేరినిన దాకా, కమ్యూనిస్టు మానిఫెస్టో నుంచి నార్మన్ బెతూన్ చేగువేరాల త్యాగాల కథలు అన్ని తోలినాళ్ళలోనే చదువుకున్నాడు. 1971లో విజయవాడ విశాలాంధ్రలో సబ్ ఎడిటర్‌గా జాయిన్ అయ్యాడు. అప్పటినుంచే పొలిటికల్ కార్టూన్లు వేయడం మొదలుపెట్టాడు. ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి, ఏటుకూరి బలరామ్మూర్తి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, సోదుం రామ్మోహన్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సూపర్ బాస్ పీసీ జోషి లాంటి అనేకమంది సహచర్యం మోహన్ జీవితానికి ఓ దారి చూపించింది. నవలలకు కవర్ పేజీలు, కథలకి ఇలస్త్రేషన్‌లు, పోరాటాలకి పోస్టర్లు మరోపక్క రోజూ వార్తల అనువాదం… ఊపిరి సలపని పని. అప్పట్లో విశాలాంధ్రలో సినిమాలకి రివ్యూలు రాసేవాడు చాందిని అనే పేరుతో. భారతీయ కళ, వెస్ట్రన్ ఆర్ట్ గురించి తగినంత అధ్యయనం చేశాడు. అదే పనిగా చదివి అంతర్జాతీయ రాజకీయాల మీద గట్టి పట్టు సాధించాడు.
ఇటు చలమూ, శ్రీశ్రీ అటు మక్దూం మోహియుద్దీన్, దేవరకొండ బాలగంగాధర తిలక్ మోహన్ ను బాగా ఇన్ఫు్లయెన్స్ చేశారు. ఎస్‌డీ బర్మన్, హేమంత్ కుమార్ పాటలు ఇష్టంగా వినేవాడు. గురుదత్ ని అభిమానించాడు, వహిదా రహమాన్‌ని ప్రేమించాడు. క్యూబా వెళ్లాలనీ, కాస్త్రోని కలవాలనీ, మాస్కో రెడ్ స్క్వేర్‌లో చెప్పులు లేకుండా నడవాలనీ కలలు కన్నాడు. నొం చొం స్కీ నీ, సార్త్రే నీ, కాఫ్కానీ చదువుకున్నాడు. ఫ్రెంచ్ దర్శకుడు గుంటర్ గ్రాస్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తీసిన టిన్ డ్రం సినిమాని గ్రాస్‌తో కలిసిచూసాడు. కార్ల్ మారక్స్ రచనలలోని చమత్కారము, కవిత్వం గురించి సాయంకాలం పార్టీల్లో చెప్పేవాడు. ఏలూరు శనివారప్పేటలోని గాలిగోపురం, మంగళగిరి గాలిగోపురం అపురూపమైనవని, శిల్పకళ గురించి మన జనానికి ఏమీ తెలీదని దిగులు పడేవాడు. రామప్ప ఆలయ శిల్పాలని జీవితాంతమూ ప్రేమించాడు.
కొండపల్లి శేషగిరిరావు బొమ్మల్లోని పరిమళభరితమైన సౌందర్యమూ, బాపు నాజూకు గీతల సన్నజాజి తీగల సౌకుమార్యము, చిత్త ప్రసాద్ బొమ్మల కొలిమిలో ఎగిసిపడే అగ్గిరవ్వల ఎరుపు, ఎం.ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లోంచి వినబడే గుర్రపు డెక్కల పిలుపుల గురించి మోహన్ చెబుతుంటే వినాలసలు!
సెర్గీ ఐజెన్ స్టీన్ ‘బ్యాటిల్ షిప్ పొట్టెన్కిన్’ లో కదిలే నీళ్ల వెలుగు, చార్లీ చాప్లిన్ ‘కిడ్’ లో ఇళ్ల అద్దాలు పగలగొట్టే కుర్రాడి కంటి మెరుపు, విక్టోరియా డిసికా ‘టూ విమెన్’ లో సోఫియా లారెన్ పెదవి విరుపు, పాకీజాలో మీనా కుమారి వెన్నెల కన్నుల్లో వొలికిన విషాదము మోహన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.
‘ఏ రాత్ ఏ చాందిని ఫిర్ కహా’ అని హేమంత్ కుమార్ పాడినా, ‘వహ కౌన్ హై తేరా’ అనో ‘సును మేరే బంధురే’ అనో ఎస్ డీ బర్మన్ గొంతెత్తినా, ‘అవిసె పువ్వులు రెండు అందకున్నవి నాకు, తుంచి నా సిగలోన తురిమిపోదువు గాని రావోయి బంగారి మామ’ అనే పాట గాలిలో తేలి వచ్చినా పరవశంతో వినేవాడు.
కవి సి నారాయణ రెడ్డి మోహన్ ఆఫీస్‌కి వెళ్లి కూర్చుని తన బొమ్మ వేయించుకొని మోహన్ ని ఆప్యాయంగా అభినందించి వెళ్లారు. మణిశంకర్ అయ్యర్ తన పొలిటికల్ సెటైర్ వ్యాసాల పుస్తకానికి మోహన్ తో కవర్ పేజీ వేయించుకున్నారు. మహా చిత్రకారుడు బాపు మద్రాస్ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక సాయంకాలం మోహన్ని కలిసి మాట్లాడేవారు. ‘మోహన్, నీ అక్షరాలలో ఒక చైనీయమైన కళా సొగసులు ఉన్నవి అన్నారు ప్రసిద్ధ ఆర్టిస్ట్ కొండపల్లి శేషగిరిరావు. రచయిత శ్రీ రమణ నుంచి కేఎన్‌వై పతంజలి, కేశవరెడ్డి, నామిని, దేవిప్రియ, శిఖామణి, శివసాగర్, సిద్ధార్థ, అసుర, ఖదీర్ బాబు దాకా మంచి రచయితలు అంతా మోహన్‌కి మంచి మిత్రులు. ‘కోటిమంది వచ్చినా చోటున్నది లోనా’ అని కృష్ణశాస్త్రి అన్నట్టు ఎప్పుడూ కవులు, రచయితలు, సంపాదకులు, ఆర్టిస్టులు మోహన్‌ని చుట్టుముట్టి ఉండేవాళ్లు. ఎన్ని బొమ్మలు వేసినా యానిమేషన్లో ప్రయోగాలు చేసినా సభలకు అటెండ్ అయినా మోహన్ 45 ఏళ్లపాటు రెగ్యులర్‌గా, నాన్ స్టాప్‌గా వ్యాసాలు రాశాడు. కళా, సాహిత్యం, రాజకీయాలు, పెద్ద ఆర్టిస్టుల గురించి మోహన్ రాసిన వందల వ్యాసాలు ఈ తరం వాళ్లకి టెకస్ట్ పుస్తకాల్లాంటివి.
‘ఉదయం’ దినపత్రిక వాళ్లు వీక్లీ ప్రారంభించినప్పుడు దానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంపాదకుడు. ఇక్కడ నువ్వు ఒక్కడివే బాగా చదువుకున్నట్టు కనిపిస్తున్నావు ప్రతివారం నాకు వ్యాసం రాయరాదూ అని అడిగారు. అప్పుడు ఆర్ట్ అంతర్జాతీయ కళాకారుల గురించి మోహన్ చాలా ఆర్టికల్స్ రాశాడు. అవన్నీ 1996లో కార్టూన్ కబుర్లు పేరుతో పుస్తకంగా వచ్చాయి.
శ్రీశ్రీకి ఇచ్చిన యోగ్యతాపత్రంలో, ‘ఇందులో మీ సెక్స్‌ని ఉద్రేకించే విషయాలు ఏమీ లేవు’ అని గుడిపాటి వెంకటచలం అన్నట్టు కార్టూన్ కబుర్లు పుస్తకం గురించి మోహన్ ఇలా రాశాడు ‘సక్సెస్ హోదా పేరు డబ్బు సుఖం కోసం మీరు చేస్తున్న గొప్ప కృషికి ఏమాత్రం పనికిరాని సొల్లు కబుర్లు ఇవి. పైగా ఆ ప్రస్థానంలో మీ కాళ్ళకు అడ్డంపడే పరమ గాసిప్ గ్రంథం ఇది. మరి మీ ఇష్టం ‘మోహన్ ఒక డ్రీమర్ అన్నారు కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి. కళ కోసం, కళలో ఉన్నత శిఖరాలు అందుకోవడం కోసం, ఆప్తులు స్నేహితుల కోసం, పూట గడవని కష్టజీవుల కోసం చివరి క్షణం దాకా నిండుగా నిజాయితీగా బ్రతికాడు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని తపించాడు. అంతర్జాతీయ కళని, భారతీయ తత్వశాస్త్రాన్నీ మరింత లోతుగా అధ్యయనం చెయ్యలేకపోయానని దిగులు పడ్డాడే తప్ప బెంజ్ కారు కొనుక్కోవాలని, బంజారాహిల్స్ లో బంగ్లా కట్టుకోవాలని ఏ బలహీనమైన క్షణాన కూడా అనుకోలేదు.- తాడి ప్రకాష్
కార్టూనిస్ట్ మోహన్.. ఒక ఎమోషన్!
‘ఉదయం’ పత్రిక ప్రారంభం అవుతున్న కాలంలో ఉద్యోగం కోసం వెళ్లి ఒక జర్నలిస్టుని కలిశాను. ఆయన మరొక పెద్ద ఆర్టిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు. ‘నీ పేరు తెలుసబ్బా… వీక్లీలలో నీ కార్టూన్లు చూశాను’ అని ప్రేమగా పలకరించాడు. ఆయనే కార్టూనిస్టు మోహన్. అదే ఆయన్ని మొదటిసారి చూడటం. నా గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకొన్నాడు. ‘అప్పుడే ఉద్యోగంలోకి ఎందుకు? డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు కదా, చదువు ముఖ్యం’ అని హెచ్చరించాడు. ఉద్యోగం అవసరం. ‘పని చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేస్తాను’ అని చెప్పడంతో ఉద్యోగం ఇచ్చారు.
ఉదయం పత్రిక ఫ్రంట్ పేజీలో రోజూ మోహన్ కార్టూన్లు పేలుతుండేవి. ‘ఉదయం’ ప్రారంభ పత్రికలో వేసిన మోహన్ కార్టూన్ ఇప్పటికీ గుర్తు. పత్రిక ఓనర్ దాసరి సైకిల్ మీద వెళ్తూ ఒక ఇంట్లో పేపర్ విసురుతూ ‘ఏమండోయ్ రీడర్ గారు, లేవండోయ్ తెల్లారింది’ అని పాడుతుంటాడు. ఆ పాట కూడా దాసరి సినిమాలోనిదే. ఈనాడులో ‘పాప’ తరువాత బాగా పాప్యులర్ అయింది మోహన్ కార్టూన్లే. అనుకరణకు అందని గీతలో రాతలో కొత్తదనానికి మేమంతా ఫిదా అయ్యేవాళ్లం. అప్పటివరకు ఇండియన్ కార్టూన్ అంటే ఆర్కే లక్ష్మణ్, ఆబూ, ఓవి. విజయన్ గురించి మాట్లాడుకునే వాళ్లంతా ఇపుడు మోహన్ గురించి చర్చించడం తెలుసు. సిటీ బస్సుల్లో, ఇరానీ కేఫుల్లో, ప్రెస్‌క్లబ్బుల్లో మోహన్ గీతల గురించే మాట్లాడుకోవడం చూశాను.
తెలుగు రాజకీయ కార్టూన్‌లో పదునైన రేఖ
తెలుగు జర్నలిజంలో రాజకీయ కార్టూన్‌లది ప్రత్యేకమైన స్థానం. దానిని మరింత పదునెక్కించడంలో, ప్రజల మనసుల్లో రాజకీయాలపై ప్రశ్నలు రేపడంలో కీలక పాత్ర పోషించింది కార్టూనిస్ట్ మోహన్ మాత్రమే. అరుదైన వ్యంగ్యంతో రాజకీయాలను ప్రశ్నించిన కళాకారుడు ఆయన. మోహన్ శైలి భిన్నమైనది. సర్రున గీసిన చిన్నగీత, దానిలో వంపు, వ్యంగ్యం ఒక ఎక్స్‌ప్రెషన్ తో ఆ రోజు రాజకీయ వాతావరణం మొత్తం కళ్ల ముందు ఉంచుతాడు. ఆయన కార్టూన్లు నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. పాలకులను చాలా గౌరవంగానే భయపడకుండా ప్రశ్నించగల ధైర్యం ఆయన గీతల్లో ఉంది.
ప్రజల పక్షాన నిలిచిన రేఖ
మోహన్ కార్టూన్లలో సాధారణ ప్రజల జీవితం ప్రతిఫలిస్తుంది. రైతు సమస్యలు, నిరుద్యోగం, అవినీతి, అధికార దుర్వినియోగం, పడిపోతున్న ప్రజాస్వామ్య విలువలు… ఇలాంటి అంశాలన్నింటినీ ఆయన తన కార్టూన్ల ద్వారా ప్రశ్నిస్తాడు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ విధానాలనే ఆయన విమర్శస్తాడు తప్ప, వ్యక్తిగత దూషణ చేయడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనపై మోహన్ వేసినన్ని కార్టూన్లు ఎవరూ గీయలేదు.
పత్రికా జర్నలిజానికి విజువల్ లైన్
కొన్ని వార్తలు చదవకపోయినా, మోహన్ కార్టూన్ చూస్తే ఆ రోజు ముఖ్యమైన రాజకీయ అంశం ఏమిటో అర్థమయ్యేది. అదే ఆయన సక్సెస్ రహస్యం. ‘కార్టూన్ అనేది వార్తకు అనుబంధం కాదు, ఒక స్వతంత్ర వ్యాఖ్య’ అని ఆయన ఒకసారి బెంగళూరులో జరిగిన నేషనల్ కార్టూన్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. సమకాలీన జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన, సమాజంపై బాధ్యత, కళపై నిబద్ధత ఈ మూడింటి సమ్మేళనమే పొలిటికల్ కార్టూన్ అంటారు మోహన్.
మోహన్ ప్రతీ గీతా హ్యూమర్‌తో పాటు ఆలోచనలు రేకిత్తించేది. ఒకపుడు పత్రికల్లో కార్టూన్లు తప్ప క్యారికేచర్లు పెద్దగా వచ్చేవి కాదు. క్యారికేచర్‌లను తొలిసారిగా పరిచయం చేసిన ఆర్టిస్ట్ మోహన్. అంతేకాదు, తెలుగులో తొలి యానిమేషన్ చేసింది కూడా ఆయనే. అప్పటి సీఎం ఎన్టీఆర్ క్యారికేచర్‌ని మోహన్ గీసినంత ముచ్చటగా ఎవరూ వేయలేదు. ఎన్టీఆర్‌పై కార్టూన్లు కూడా అంతే హాయిగా నవ్వుకునేలా ఉండేవి తప్ప ద్వేషంతో కించపరిచేలా ఎన్నడూ వేయలేదు. అందుకే ఆ మహానాయకుడు మోహన్ని ఒకసారి ప్రేమగా టీకి ఆహ్వానించాడు. మోహన్ తో కలిసి చేసిన నా జర్నీ చాలా జ్ణాపకాలను మిగిల్చింది. ఇండియాలో తొలిసారిగా ఇంటర్నేషనల్ కార్టూన్ ఫెస్టివల్‌ని హైదరాబాద్‌లో మోహన్ మేము కలిసి నిర్వహించి బంపర్ హిట్ చేశాం. విన్స్, మారియో, సుధీర్ టైలాంగ్, విజి నరేంద్ర, త్రయంబక్ శర్మ, సురేష్ సావంత్ లాంటి నేషనల్ కార్టూనిస్టులను ఆహ్వానించినపుడు వారు హైదరాబాద్ చేరుకోగానే ‘Where should I see Mohan immediately?’ అని అసక్తిగా అడిగేవారు. దటీజ్ మోహన్. ఇద్దరం చాలా ప్రాంతాలు ట్రావెల్ చేశాం. జేబులో రూపాయి లేకపోయినా ఎవరిపైనా ద్వేషం, కోపం, అసూయ చూపడం ఎపుడూ చూడలేదు. అసలు కపటం అంటే తెలియని అద్భుత మానవుడు మోహన్. తన దగ్గరకు వచ్చిన వాళ్లకు ఆర్ధిక ఇబ్బందులు ఉంటే, తన జేబులో ఉన్నదంతా ఇచ్చేసి, సరిపోకపోతే, ‘ వీలుంటే హెల్ప్ చేయబ్బా’ అంటూ నా దగ్గరకు పంపేవాడు. ఆయన గీత, రాత, యానిమేషనే కాదు, అయన వ్యక్తిత్వాన్ని, మానవీయతను కూడా అందుకునే కళాకారులు బహు అరుదు. కవిత్వంలో శ్రీశ్రీ తరువాత అంతా శూన్యం అనటంలో ఎంత నిజం ఉందో మాకు తెలీదు కానీ, మోహన్‌కి ముందు వెనకా మాత్రం అంతులేని శూన్యం ఆవరించింది. మా తరాన్ని కదిలించి, నడిపించి మా హృదయాల్లో నిలిచిన అద్భుత కళాకారుడు మోహన్.
రాజకీయ ప్రసంగాలు గంటలకొద్దీ సాగినా, విశ్లేషణలు పేజీల కొద్దీ రాసినా ఒక మంచి కార్టూన్ క్షణాల్లో పాఠకులను ప్రభావితం చేస్తుంది. అలాంటి సెటైర్‌కే మోహన్ చిరునామా. అందుకే భారతీయ రాజకీయ కార్టూన్ రంగం గురించి మాట్లాడితే మోహన్ పేరు తప్పక వినిపిస్తుంది. కార్టూనిస్ట్ మోహన్ కేవలం ఒక ఆర్టిస్టు మాత్రమే కాదు. అతను ఒక ప్రజాస్వామ్య గళం. రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం పెంచిన కళాకారుడు. తెలుగు జర్నలిజంలో ఆయనది చెరగని సంతకం. ఎందుకంటే అవి కాలాన్ని ప్రశ్నించిన రేఖలు.-శ్యాం మోహన్