హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. లంబాడీలకు మంత్రి ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. మెదక్ నర్సాపూర్ లో హరీష్ రావు పర్యటించారు. నర్సాపూర్ సబ్ స్టేషన్‌లో లాగ్ బుక్కులను పరిశీలిస్తే రైతులకు 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని తెలిసిందని అన్నారు. మీద నుండి కరెంట్ రాకపోతే వీళ్ళు మాత్రం ఏం చేస్తారని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేక మూలకు పడేశారని మండిపడ్డారు. కరెంట్ సరఫరా అవ్వడం లేదని, ట్రాక్టర్లలో డీజిల్ నింపడానికి డబ్బులు లేవని అంటే అధికారులను సస్పెండ్ చేస్తున్నారని, ప్రభుత్వం నిజాయితీగా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిఆర్ఎస్ దే అధికారమని, సిఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడటం కాదు.. ప్రజలు రేవంత్ ను ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గరున్నవని జోస్యం చెప్పారు. ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ.. రైతులపై లేదని విమర్శించారు. ఏ ఊరికి వెళ్దామో చెప్పు.. దమ్ముంటే రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్ కు ప్రజలు ఓ లెక్కనా? అని హరీష్ రావు ప్రశ్నించారు.