అమెరికా రాష్ట్రం పెన్సిల్వినియాలోని ఫిలడెల్ఫియాలో ఓ నర్సింగ్ హోంలో భారీ స్థాయి శబ్ధంతో పేలుడు జరిగింది. అక్కడి బ్రిస్టల్ హెల్త్ అండ్ రిహబ్ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామంతో భయానక పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది గ్యాస్ లీక్ అవుతున్నదని పరిశీలిస్తూ ఉండగా పేలుడు జరిగింది. దీనితో నర్సింగ్ హోం దద్దరిల్లింది. పలు అంతస్తుల వరకూ దట్టమైన పొగ అలుముకుంది. చాలా మంది రోగులు, సిబ్బంది, డాక్టర్లు లోపల చిక్కుపడ్డారు. అనేకులు గాయపడ్డారు ఈ ఘటన మంగళవారం రాత్రి తరువాత జరిగింది. విషయం తెలియగానే అక్కడికి హుటాహుటిన అత్యవసర సహాయక దళాలు, అగ్నిమాపక శకటాలు తరలివచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా అంబులెన్స్‌ను పంపించారు. చాలా మంది గాయపడ్డారని తెలిపిన అధికారులు , వీరిలో ఎవరైనా విషమ పరిస్థితిలో ఉన్నది ? లేక చనిపోయిందనే విషయం నిర్థారించలేదు. 174 పడకల ఈ నర్సింగ్ హోంలో జరిగిన పేలుడు ప్రమాదమా ? లేక ఇతర కారణం ఏదైనా ఉందా? అనేది దర్యాప్తు బృందాలు తెలుసుకుంటున్నాయి. నర్సింగ్‌హోంలో చికిత్సలే కాకుండా , మానసిక స్వాంతన , రోగుల సమీపబంధువులు కూడా ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల చాలా దూరం వరకూ భీకరమైన చప్పుడు విన్పించింది. దీనితో స్థానికులు ఏదైనా విమానం కూలిందా? అని భయపడ్డారు.