ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్‌ని మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ కోల్పోయిన విషయం తెలిసిందే. 3-0 తేడాతో సిరీస్‌ని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో ఇప్పటికే పేలవ ప్రదర్శనతో బాధపడుతున్న ఇంగ్లండ్‌కు పుండు మీద కారం చల్లినట్లు మరో పరిస్థితి వచ్చింది. ఎడమ తొడ కండరాల గాయం చివరి రెండు టెస్ట్‌లకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ఇంగ్లండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ సేవలను కోల్పోయింది. ఇప్పుడు ఆర్చర్ కూడా దూరమవ్వడంతో ఇంగ్లండ్ పేస్ విభాగం మరింత బలహీనపడింది. ఇక ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇక ఆర్చర్ పూర్తి సిరీస్‌కి దూరం కాగా.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్‌ను నాలుగో టెస్ట్ నుంచి బోర్డు తప్పించింది. పోప్ స్థానంలో నాలుగో టెస్ట్‌లో జేకబ్ బేతల్‌ని జట్టులోకి తీసుకుంది. ఈ రెండు మార్పులు మినహా తుది జట్టు యధాతథంగా కొనసాగనుంది.