పార్లమెంట్‌లో బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు దానిపై సమగ్రంగా చర్చ జరగాలి. ఇంకా సంబంధిత శాఖలకు చెందిన పార్లమెంటరీ స్థాయి సంఘాల పరిశీలనకు పంపాలి. ఆయా కమిటీలు ప్రజా సంప్రదింపుల ద్వారా ప్రజలు, నిపుణులు, వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత వాటిని సమీక్షించి నిగ్గు తేలుస్తాయి. ఈ ప్రజా సంప్రదింపులు అనేవి శాసన ప్రక్రియలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి, చట్టాల రూపకల్పనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి అనుసరించే ప్రజాస్వామ్య పద్ధతి. కానీ ఈనాడు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో ఈ విధమైన ప్రజా సంప్రదింపులు అనేవి ఎంతవరకు జరుగుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. పార్లమెంట్ చర్చలతో కానీ, స్థాయి సంఘాల పరిశీలనతో కానీ నిమిత్తం లేకుండా కేవలం మూజువాణీ ఓటు ద్వారా బిల్లులను ఆమోదింప చేసుకునే ఏకపక్ష పోకడను ఏమనాలి? పార్లమెంట్ సభ్యులు దీనిపై నిలదీసినా పట్టించుకోని అడ్డగోలు విధానం ఇప్పుడు సాగుతోందనడానికి అనేక సాక్షాలు కనిపిస్తున్నాయి.
వాయనాడ్ ఎంపి ప్రియాంకగాంధీ డిసెంబర్ 17న వికసిత్ భారత్ గ్యారంటీ (విబిజిరామ్‌జి)అనే కొత్త ఉపాథి పథకానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు దీనిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని లోక్‌సభకు సూచించారు. ఈ బిల్లు నమూనా ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్ సభ్యుల పోర్టల్ లోకి, అందుబాటు లోకి రాగా, 5 45 గంటలకే సవరణలు కోరడమైంది. ఇంత హడావిడిగా సూచనలు కోరడం ఇదేం పద్ధతి? అని విపక్ష సభ్యులు నిలదీశారు. మొదటిసారి ఈ బిల్లును చదివి అర్థం చేసుకోవడానికి కనీసం ఒక రోజైనా ముందుగా తమకు అందజేయడం సంప్రదాయం కాదా? అని ఆక్షేపించారు. ఈ అభ్యంతరాలన్నీ గాలిలో పేలపిండిలా కొట్టుకుపోయాయి. మూజువాణీ ఓటుతో డిసెంబర్ 18 నే బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. ఉపాధి పథకం అన్నది మనకున్న చట్టాల్లో అతి ముఖ్యమైనది. అది పూర్తిగా రద్దు కావడం ఎందుకో మనకు తెలియదు. బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిలో ఏముందో చర్చించడానికి అవకాశం ఇవ్వకుండా, సంబంధిత స్థాయి సంఘాల పరిశీలన లేకుండా గుత్తాధిపత్యంతో బిల్లులను ఆమోదింప చేసుకోవడం మోడీ సర్కారు లోనే నిత్యకృత్యమవుతోంది.
2004-2009 వరకు 14వ లోక్‌సభ కాలంలో బిల్లుల్లో 60 శాతం స్థాయి సంఘాల పరిశీలనకు పంపడమైంది. 2009 14 కాలంలో ఈ సంఖ్య 71% అయింది. మోడీ పగ్గాలు చేపట్టిన మొదటి ప్రభుత్వ కాలంలో ఇది 25 శాతానికి పడిపోయింది. మోడీ రెండోసారి ప్రభుత్వ (201924) కాలంలో ఇది 16 శాతానికి దిగజారింది. అంటే ఇదంతా కేవలం నిర్లక్షంగా ఉద్దేశపూర్వకంగా జరుగుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇదే విధంగా సమాచార హక్కు చట్టం కూడా సంబంధిత స్థాయి సంఘం పరిశీలన లేకుండా 2019లో సవరణలో చోటుచేసుకున్నాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో సమాచార హక్కు కల్పనలో భారత్ ర్యాంక్ 8 కి, తరువాత 9 కి పడిపోయింది. బిల్లులను ఈ విధంగా జబర్దస్తీగా ఆమోదింప చేసుకోవడంపై 2019లో తెలుగుదేశం, కాంగ్రెస్, సమాజ్‌వాది, బహుజనసమాజ్, సిపిఎం తదితర పార్టీల ఎంపిలంతా పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ప్రజా సంప్రదింపుల ద్వారా అభిప్రాయాలను సేకరించి లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. 2020 సెప్టెంబర్ 20న లోక్‌సభలో ఆమోదించిన ఆర్డినెన్సులు రాజ్యసభలో మూజువాణీ ఓటు ద్వారా ఆమోదం పొందాయి. డివిజన్ ఓటు పద్ధతి అమలు చేయాలని సభ్యులు డిమాండ్ చేసినా ఆనాడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ దానిని గుర్తించలేదు. రాజ్యసభ టివి ప్రత్యక్ష ప్రసారాలు బంద్ చేశారు. ఎంపిల మైక్రోఫోన్లు స్విచాఫ్ చేశారు. మొత్తం మీద సభ్యుల ఎస్ లేదా నో అనే డివిజన్ ఓటు లేకుండానే ఆర్డినెన్సులను ఆమోదింప చేసుకున్నారు. ఈ చిట్కాయే బిజెపి తరువాత అనుసరించడం ప్రారంభించింది.
కర్ణాటకలో ఆనాటి బిజెపి ప్రభుత్వం గోవధ వ్యతిరేక బిల్లును మూజువాణీ ఓటుతోనే ఆమోదింప చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను కూడా ఇదే విధంగా అమలులోకి తెచ్చింది. రైతులకు క్షేత్రస్థాయిలో ఎంతవరకు వీటివల్ల ప్రయోజనం కలుగుతుందో అన్న పరిశీలనకు అవకాశం ఇవ్వలేదు. పార్లమెంట్‌లో విపక్షాలు అరచిగీ పెట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన కొత్త ఉపాధి పథకం కోట్లాది మంది భారతీయులపై విపరీత ప్రభావం చూపిస్తాయని కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ ఏకగ్రీవంగా నిరసిస్తున్నాయి. ఈ చట్టాలపై ప్రజల స్పందన ఏమిటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ప్రవేశపెట్టిన చట్టాలన్నీ గొప్పవే అని చెప్పలేం. అలాగే వాటిని పరిశీలించకుండా లోపాలను సవరించకుండా అమలులోకి తీసుకువచ్చినా తగిన ప్రయోజనం ఉండదు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఆలోచన లేకుండా చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టమైనప్పుడు ప్రభుత్వం తన అహంకార ధోరణిని విడిచిపెట్టి ఆ చట్టాలను విరమింప చేసుకోవడం ఉత్తమం. అలాంటి సందర్బాల్లో ప్రజలకు క్షమాపణ చెప్పి వెనక్కు తగ్గడం సముచితం. తాము తప్ప మరెవరూ ఈ దేశాన్ని ముందుకు ప్రగతి పథంలో నడిపించలేరని, తమకు ప్రజలే అపరిమిత శక్తిని బహుమతిగా ఇచ్చారని విశ్వసించడం శుద్ధ అవివేకం, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అవుతుందనడంలో సందేహం లేదు.