29 నుంచి అసెంబ్లీ సమావేశాలు
జనవరిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసీ ఎన్నికలు
ఏడు ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులు
నీటి పారుదల రంగంపైనా చర్చ
జిహెచ్‌ఎంసిలో మున్సిపాలిటీపైనా చర్చ
సిఎం, మంత్రుల సమావేశంలో నిర్ణయాలు
ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేః సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. అదేవిధంగా జనవరిలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోలు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు వివిధ కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిబంధన ప్రకారం ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున, శీతాకాల సమావేశాలను 29న ప్రారంభించి, ఆ తర్వాత వచ్చే నెల 2వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. సమావేశాలు ప్రారంభించిన తర్వాత రెండు రోజుల్లో (31 డిసెంబర్, జనవరి 1) వేడుకల కోసం విరామం తీసుకుని ఆ తర్వాత రెండో తేదీ నుంచి కొనసాగించుకుందామని పలువురు మంత్రులు చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అంశంతో పాటు ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు సమాచారం.
స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి: సిఎం హెచ్చరిక
ఇదిలాఉండగా రాబోయే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత కటువుగానే చెప్పినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ కొందరు మంత్రుల జిల్లాలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ కంటే బిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచులే అత్యధికంగా గెలవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలా ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన జిల్లాల్లో నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయని వాటికి సంబంధించిన గణాంకాలాను మంత్రులకు అందజేసి అలా ఎందుకు జరిగిందని నిలదీసినట్లు తెలిసింది. కొంత మంది పార్టీ ఎమ్మెల్యేల పని తీరు నచ్చలేదని, అనవసరంగా బంధు, మిత్రులను బరిలోకి దించడం వల్ల నష్టపోయామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది.
ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వత్తిళ్ళకు లొంగకుండా, కఠినంగా ఉండాలని, పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వారికే టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని సిఎం సూచించారని తెలిసింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించే బాధ్యతను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు తీసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులనుద్ధేశించి అన్నారని విశ్వసనీయ సమాచారం. అభ్యర్థుల ఎంపిక ఆచితూచి జరగాలని, గెలిచే అభ్యర్థులనే బరిలోకి దింపాలని ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడరాదని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల ముందు మండల, జిల్లా స్థాయిలో విపక్షాల నుంచి ముఖ్య నాయకులు ఎవరైనా పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిస్తే వారిని చేర్చుకునేందుకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
ఇదిలాఉండగా పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత, మాజీ సిఎం కెసిఆర్ లేవదీసిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కెసిఆర్ లేవదీసిన అంశాలపై అసెంబ్లీలో నిలదీయాలని, ఆ పార్టీ నాయకులను ఇరకాటంలో పెట్టే విధంగా, వారి హయాంలో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు ఉంచి ఆత్మరక్షణలో పడేసే విధంగా వ్యూహాన్ని అనుసరించాలని మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష నాయకుడు చర్చకు రప్పించేలా ఆ పార్టీకి సవాళ్ళు విసరాలని, ఎదురు దాడికి దిగడం ద్వారా వారిని ఇరకాటంలోకి నెట్టాలని సూచించినట్లు తెలిసింది. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో చర్చకు తాను బలంగా సమాధానం చెప్పగలనని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారని తెలిసింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా గోదావరి కృష్ణా జలాలపై చర్చకు పెట్టి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి వార్డుల విభజనపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి సవివరంగా వివరించినట్లు సమాచారం. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆశించిన దానికంటే తగ్గిన సీట్లు, రాబోయే స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో పార్టీ హామీ ఇచ్చిన మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేసే విషయంపై మంత్రుల అభిప్రాయాలను సిఎం తీసుకున్నట్లు తెలిసింది. శీతాకాల సమావేశాల్లో ఏడు ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులపై కూడా మంత్రులకు సిఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది.