బిజెపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తన స్వరం మార్చారు. పొరుగు దేశాల నుంచి సరిహద్దులు దాటుకుని చొచ్చుకు వస్తున్న చొరబాటుదారుల సమస్యపైన, ఎన్నికల కమిషన్ ఆదేశాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఎస్‌ఐఆర్) ను సమర్థించడం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి వాటినే తమ ప్రచారానికి ప్రధాన ఇంధనంగా వాగ్బాణాలు కురిపిస్తున్నారు. అంతేకాదు విపక్ష పాలిత రాష్ట్రాల్లో తుపాకులు ఎక్కుబెట్టి అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తప్పనిసరి అని బెదిరిస్తున్నారు. ‘జంగిల్‌రాజ్’ (ఆటవిక పాలన) అనే బెదిరింపుతో బీహార్‌లో ఏ విధంగా ఓట్లను కొల్లగొట్టి గెలుపొందారో అనే రీతిలో విపక్ష రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో జంగిల్‌రాజ్ బూచి చూపించి బెదిరిస్తున్నారు. చొరబాటు సమస్యపై మోడీ ఒక్కరే ఆందోళన చేస్తున్నట్టు కాదు, దాని ప్రభావం మొదటిసారి స్థానిక జనాభాపై చూపించింది. ఈ ఏడాది మొదట్లో జార్ఖండ్‌లో మోడీ ప్రయోగించిన ఏకైక అతి ముఖ్యమైన ప్రచార థీమ్ ‘చొరబాటుదారుల సమస్య’ ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చొరబాటుదారుల వల్ల స్థానిక జనాభాకు ఒక బెదిరింపుగా మారింది.
ఈ ప్లాను ఎన్నికల్లో వర్క్‌అవుట్ కానప్పటికీ గిరిజన ప్రజలు ఎక్కువగా నివసించే సరిహద్దు రాష్ట్రం అంత ఆసక్తిగా స్పందిచనప్పటికీ, రాబోయే ప్రమాదం ఉందని మోడీ హెచ్చరించారు. ఇప్పుడు ఆ థీమ్‌నే తదుపరి గమ్యస్థానానికి తీసుకెళ్తున్నారు. బిజెపి తన పార్టీ అజెండాలో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అక్కడ కొన్ని చొరబాట్లను చూపించడంలో కొంతవరకు పురోగమించగలిగింది. ఇతర రాష్ట్రాలతో సమానంగా సుస్థిర అభివృద్ధిని పార్టీ సాధించలేని పరిస్థితుల్లో అక్కడ గెలుపొందడానికి వేరే మార్గాలను అనుసరిస్తోంది. పశ్చిమబెంగాల్ విషయంలో ఎలాగైనా ఓట్ల బ్యాంకును కొల్లగొట్టాలన్న వ్యూహంతో అక్రమ చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని అందుకే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను అడ్డుకుంటోందని మోడీ పెద్ద అభాండం వేశారు. దీనికి తోడు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలు తున్నాయని, ఇది మహాజంగిల్ రాజ్ వంటి పరిస్థితి అని ఆరోపించారు. కానీ ఓటర్ల జాబితా సవరణ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగానే ఉన్నారు. సవరణ పేరుతో భారీ ఎత్తున ప్రజల ఓటు హక్కును కాజేస్తున్నారని, ప్రత్యేకించి మైనారిటీలు, పేదల ఓటు హక్కు కోల్పోతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఓటర్ల సవరణ మొదటి జాబితాలో తొలగించిన ఓటర్ల పేర్లను పరిశీలిస్తే మాతువా సామాజిక వర్గానివే ఎక్కువగా ఉన్నాయి.
హిందూ నామసుద్రలకు చెందిన వీరంతా బంగ్లాదేశ్ (నాటి తూర్పు పాకిస్తాన్) నుంచి పశ్చిమబెంగాల్‌కు 1947లో ఎప్పుడో తరలివచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నాడియా, హౌరా, కూచ్ బీహార్ తదితర సరిహద్దు జిల్లాల్లో వీరు ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో రెండో భారీ షెడ్యూల్డ్ కులంగా మాతువా సామాజిక వర్గం ఉంటోంది. వీరు ఓటు హక్కు కోల్పోవడంపై ప్రధాని మోడీ ఇంతవరకు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడే కాదు 2019, 2021లో ప్రధాని మోడీ ఈ ప్రాంతానికి వచ్చినా వారి పౌరసత్వం గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలికిన ఈ సామాజిక వర్గం ఎస్‌ఐఆర్ మొదటి దశ తరువాత ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో వీరి పేర్లు తొలగించబడ్డాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం తొలగించిన ఓటర్ల పేర్లలో అనేక మంది పేర్లు ఉనికిలో లేకపోవడం కానీ, లేదా వారి తల్లిదండ్రుల పేర్లు అయినా 2002 నాటి జాబితాలో కనిపించలేదని చెబుతోంది. అయితే మాతువా సామాజిక వర్గం తమ ఓటు బ్యాంకుగా పరిగణించిన బిజెపి, మాతువాలకు, ఇతర బంగ్లాదేశ్ శరణార్థులకు చట్టం ప్రకారం పౌరసత్వం కల్పించేందుకు బిజెపి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.
ఓటర్ల జాబితాలో వీరిని చేరుస్తామని బిజెపి భరోసా ఇస్తున్నా ఇంకా వారిలో నమ్మకం కలగడం లేదు. ఎస్‌ఐఆర్ నుంచి తమ ఓటు హక్కు తొలగించారని మాతువా లోని ఒక వర్గం ఠాకూర్ నాయకత్వంలో ఆందోళన చేపట్టింది. చొరబాటుదారులన్నది పెద్ద సమస్యే. చొరబాటుదారులకు ఓటు హక్కు ఉండాలని ఎవరూ వాదించరు. కానీ దేశ పౌరులను గుర్తించడానికి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ప్రక్రియను వినియోగించి వారి పేర్లు లేవని, పౌరులు కారని వారి పేర్లను తొలగించడమే రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాని విధానం. ప్రధాని మోడీ చొరబాటుదారుల ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడంలో ఎస్‌ఐఆర్ అత్యంత సామర్థాన్ని చూపిస్తోందని పదేపదే ప్రశంసిస్తున్నారు.
కానీ దీనివల్ల ఎస్‌ఐఆర్ అంటే జాతీయ పౌరుల జాబితా తయారీ విధానాన్ని మరో మార్గంలో అమలు చేస్తున్నారని ఒక వర్గం వారికి భయాందోళనలను రేకెత్తిస్తూ మరిన్ని ఆత్మహత్యలకు దారితీస్తోంది. మరింత ఆందోళనకరంగా మైనారిటీల పట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించేలా ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన ఉద్దేశాలను స్పష్టంగా తేటతెల్లం చేయగలగాలి. చొరబాట్లను పదేపదే సూచించడం పారదర్శకం కాదు. పశ్చిమబెంగాల్‌ను ప్రధాని మోడీ జంగిల్‌రాజ్‌గా పోల్చి ప్రచారం చేయడం కూడా అత్యంత వివాదాస్పదమే. బీహార్‌లో శాంతిభద్రతలు పేలవం అన్న అంశం బాగానే ఆకట్టుకున్నా, పశ్చిమబెంగాల్‌లో అలాగే ఆ థీమ్‌ను స్వాగతిస్తారన్నది ప్రశ్నార్థకం. విచిత్రంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే థీమ్‌తో ఇదివరకటి వామపక్ష ప్రభుత్వ పాలనలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చట్టబద్ధపాలన అనే ఆలోచనను కూల్చివేసిందని ఆరోపిస్తోంది.