గత ప్రభుత్వం కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల
విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రజా ప్రభుత్వం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం విద్యతోనే సమాజంలో సమూల మార్పులు వస్తాయన్నారు.
బకాయిల విషయానికి వస్తే బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాభవన్‌లో ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూ.152.59 కోట్లు విడుదలయ్యాయి. సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యం, విద్య ప్రజా ప్రభుత్వం ఎజెండా
ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్య జనుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే మా ఎజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం బేగంపేటలోని తాజ్ వివాంతా హోటల్‌లో నిర్వహించిన విజయ మెడికల్ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రెండవ శ్రేణి నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ప్రారంభించాలని విజయ మెడికల్ సెంటర్ నిర్ణయించడం అభినందనీయమన్నారు. వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అన్ని రకాల పరీక్షలను చేయాలని అందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు.
కొన్ని దశాబ్దాల క్రితమే లేజర్ వైద్యం ద్వారా మ్యాక్సీవిజన్ కాసు ప్రసాద్ రెడ్డి తన జ్ఞానాన్ని సమాజానికి ఇచ్చారని వివరించారు. సూర్యనారాయణ, ప్రసాద్ రెడ్డి, వేలు ముగ్గురు బాల్య స్నేహితులు కొన్ని దశాబ్దాల పాటు కలిసి ఉండటమే కాకుండా విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కీలకమైన తొలి రక్షణ అడుగును బలోపేతం చేసే ప్రయత్నమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.