ఛండీగఢ్: సైబర్ వలకు చిక్కుకొని విలవిలలాడి ఓ మాజీ ఐపిఎస్ అధికారి తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ సంఘటన పంజాబ్‌లోపి పటియాలాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమర్ సింగ్ చహల్ అనే ఐపిఎస్ అధికారి గతంలో పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిబిఎస్ బ్యాంకు సిఇఒ, సంపద నిర్వహణ అధికారిగా పని చేశారు. పదవీ విరమణ చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని అమర్ సింగ్‌కు సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టడంతో అధిక మొత్తంలో లాభాలు చూపించడంతో అమర్ సింగ్ వారిని గుడ్డిగా నమ్మారు. వాటిని ఉపసంహరించుకునేందుకు సర్వీసు రుసుము, పన్నుల రూపంలోనూ భారీ మొత్తంలో చెల్లించాడు. నకిలీ డ్యాష్‌బోర్డులు ద్వారా తనని నమ్మించారని గ్రహించాడు. అప్పటికే అతడు రూ.8.10 కోట్లు మోసపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఒక మాజీ ఐపిఎస్ అధికారిగా ఉండి సైబర్ వలలో చిక్కుకోవడంతో మానసికంగా కుంగిపోయాడు. తాను మోసపోయానని గ్రహించి పంజాబ్ డిజిపికి 12 పేజీల లేఖ రాశాడు. అనంతరం తన వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.