పాట్నా : లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఒక పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలను అపఖ్యాతిపాలు చేస్తుంటారని, విదేశీ పర్యటనల్లో స్వదేశం భారత్‌ను విమర్శిస్తుంటారని ఆయన విమర్శించారు. ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్ పేరు ప్రస్తావించకుండా బీహార్‌లో కూడా అలాంటి పార్ట్‌టైమ్ పొలిటీషియన్ ఉన్నారని, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా విదేశీ పర్యటనల్లో ఆనందం అనుభవిస్తున్నారని ఆరోపించారు. దీనికి విరుద్ధంగా తాము బీజేపీలో పూర్తికాల రాజకీయ నేతలమని, 24×7 రోజులూ పనిచేయాలన్నదే తమ నమ్మకమని పేర్కొన్నారు.
ఇలాంటి రాజకీయ నాయకులను ప్రజలు శిక్షించే కాలం వచ్చిందన్నారు. బీహార్‌లో అది మొదలైందని, పశ్చిమబెంగాల్, కేరళలో కూడా అది కొనసాగుతుందన్నారు. పదిరోజుల క్రితం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పొందిన తరువాత స్వంత నియోజకవర్గం బంకిపూర్‌కు నితిన్ రావడం ఇదే తొలిసారి. అత్యున్నత పదవిని సాధించిన తొలి బీహార్ పుత్రునిగా కార్యకర్తలు ఆయనకు ఘనంగా అభినందన సత్కారం చేశారు.