రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు
రేవంత్‌రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వం
కెసిఆర్ స్టేట్స్‌మెట్‌లా మాట్లాడితే, రేవంత్‌రెడ్డి స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు
చొక్కాలు మార్చినంత మాత్రాన రేవంత్‌రెడ్డి పార్టీలు మార్చారు
చంద్రబాబు మీ గురువు అని మేం అంటే రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు
వెంకయ్యనాయుడుతో స్వయంగా చంద్రబాబే తన గురువు అని అంగీకరించారు
సోనియాగాంధీని ఓసారి దేవత అంటారు, మరోసారి బలిదేవత అంటారు
కృష్ణా జలాల్లో 45 టిఎంసిలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారు
ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారు
మంత్రి ఉత్తమ్ ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి
కెసిఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సిఎం, నీళ్ల మంత్రికి ఎందుకంత ఇబ్బంది
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల కోసంమే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మాట్లాడారని ఆ పార్టీ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ ఆరోపించారని, రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని సిఎంను కోరారు. కెసిఆర్ స్టేట్స్‌మెన్‌గా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, కెసిఆర్ ప్రెస్‌మీట్ పెట్టగానే వెంటనే సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ పెట్టడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి స్థాయికి తగ్గ ప్రవర్తన కాదని అన్నారు.
కెసిఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి.. లేదంటే సమాధానాలు చెప్పాలని, అది చేయకుండా మరుగుజ్జు మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్‌ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం అయితే రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం అని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ ఎదిగినట్లు రేవంతరెడ్డే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పిసిసి పదవిని కొనుగోలు చేసినట్లు గతంలో కోమటిరెడ్డి చెప్పారని అన్నారు. తమది అలాంటి నాయకత్వం కాదని, నిజాయతీగా త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వమని చెప్పారు. ఎంఎల్‌ఎ పదవులు, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీ నేతలదని పేర్కొన్నారు. చొక్కాలు మార్చినంత మాత్రాన రేవంత్‌రెడ్డి పార్టీలు మార్చారని, ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని, ఆయనకు నీతి జాతి ఏమైనా ఉందా..? అని నిలదీశారు. ఎంఎల్‌సిని కొంటూ రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని అన్నారు.
రేవంత్‌కు ఒక స్టాండ్, సిద్దాంతం, పద్ధతి లేదని విమర్శించారు. తమది త్యాగాల చరిత్ర అయితే, ఆయనది వెన్నుపోటు చరిత్ర అని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎపి సిఎం చంద్రబాబు గురువు అని అంటే ఆయన తమపై విమర్శలు చేస్తారని, కానీ ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతిని కలిసి చంద్రబాబే తన గురువు అని చెప్పారని అన్నారు. ఒకసారి చంద్రబాబును గురువు అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తావు, మరోసారి తానే స్వయంగా ఆయన గురువు అని అంగీకరిస్తారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని ఒకసారి దేవత అంటారు, ఇంకోసారి బలిదేవత అంటారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఒక్కటైనా చేశారా..?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సిఎం, నీళ్ల మంత్రికి ఎందుకంత ఇబ్బంది అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో 45 టిఎంసిలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉత్తర కుమారుడిలా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఒక్కటైనా చేశారా చెప్పాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్‌లు వాపస్ వచ్చాయని అంటున్నారని, 2023లో డిపిఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) అనుమతి, సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్(సిఎస్‌ఎంఆర్‌ఎస్) అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు (సిజిడబ్లూబి) అనుమతి ఎలా సాధించామని అడిగారు.
పాలమూరు డిపిఆర్ 2023 ఏప్రిల్ 12న వాపస్ వస్తే, మూడు రోజుల్లోనే తమ ప్రభుత్వం జల్ శక్తి మంత్రిత్వ శాఖను లేఖ రాసిందని, కెసిఆర్ జల్ శక్తి అధికారులతో మాట్లాడారని గుర్తు చేశారు. తాము ఇఎసి సిఫారసు సహా 7 అనుమతులు సాధించించామని తెలిపారు. 2024 డిసెంబర్ 19న డిపిఆర్ వాపస్ లేఖ రాస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇదే కదా కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిందని పేర్కొన్నారు. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదని నిలదీశారు. ఇది కాకుండా 45 టిఎంసిలు చాలు అంటూ ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, సిఎం లేఖ రాశారని, మళ్లీ సిగ్గులేకుండా తాము రాయలేదు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 టిఎంసిలతో ఎవరికి అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకా, రంగారెడ్డి జిల్లాకా, నల్లగొండ జిల్లాకా..? అని అడిగారు.తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తి చేసిందని, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. నార్లాపూర్ పంప్ హౌజ్‌లో పంపును రన్ చేసి మహబూబ్ నగర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తాయని కెసిఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. పాలమూరు 90శాతం పనులు ఎక్కడ అయ్యారని మంత్రి అంటున్నారని, అక్కడి వెళ్తామా..అంటూ సవాల్ విసిరారు.
ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కెసిఆర్
ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కెసిఆర్ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని, జిఎస్‌డిపి, తలసరి ఆదాయంలో కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపారని చెప్పారు. మూడురెట్ల జిఎస్‌డిపి, తలసరి ఆదాయం పెరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి తన రెండేళ్ల పాలనలో చెక్ డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. 11 లక్షల 60 వేల 895 ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీ సిఎం చెప్పారని, కనీసం 11 వేల ఎకరాలకు అయినా నీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. తాము 17 లక్షల 24 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చామని, 31 లక్షల ఎకరాలను స్థిరీకరించామని చెప్పారు. రేవంత్‌రెడ్డి 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఎక్కడ ఇచ్చాడో చూపెట్టాలని, లేదంటే ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా మోసం చేశామని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. కాంగ్రెస్ నేతలు ఇంక సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ ప్రభుత్వంలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు కుప్పకూలిందని,కనీసం శవాలను కూడా బయటికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్‌వన్ చేశామని సిఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని కెసిఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి రాకముందే 2022 -23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి, తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలబెట్టింది కెసిఆర్ అని పేర్కొన్నారు. అప్పట్లో ఒడ్లు కొనలేమని కేంద్రం చేతులు ఎత్తేస్తే తాము కెసిఆర్ నాయకత్వంలో ఢిల్లీకి పొయ్యి ధర్నాలు చేశామని గుర్తు చేశారు.
2020 -21లో ధాన్యం సేకరణలో కూడా తాము రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని అన్నారు. ఆ ఏడాది తాము 141 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. రేవంత్‌రెడ్డి వచ్చినంక ఇంత ధాన్యాన్ని ఎన్నడూ సేకరించలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోనే పంటలు పండుతున్నాయని చెప్పారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి ప్రాజెక్టుల కింద పండే పంటలు కాళేశ్వరం నీళ్లతోని పండుతున్న పంటలు కాదా..? అని ప్రశ్నించారు. ఎక్కువ వర్షాలు పడితే ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి, మధ్యతరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడుతామని వివరించారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రిసోర్సెస్ అని చెప్పారు. గడిచిన రెండేళ్లుగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఎస్‌ఆర్‌ఎస్‌పి, ఎల్లంపల్లి మోటార్‌లు ఆన్‌చేసి రిజర్వాయర్‌లను నింపామని, లక్షల ఎకరాలకు నీళ్లు పారించి పంటలు పండించామని హరీష్‌రావు తెలిపారు.