బెర్లిన్: అందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ ప్రతిపాదిస్తోందని, రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య ఉన్న సమానత్వ భావనను దెబ్బ తీస్తూ, రాజ్యాంగం లోని మౌలిక సూత్రాలను బీజేపీ కాలరాస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్మనీ లోని బెర్లిన్‌లో గల హెర్టీస్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఒక గంట నిడివి గల వీడియోను విడుదల చేసింది.
ప్రపంచంలో భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇది కేవలం భారతీయుల ఆస్తిమాత్రమే కాదని, ప్రపంచ సంపద అని రాహుల్ అభివర్ణించారు. దేశం లోని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఏ దాడి అయినా, దానిని అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగే దాడిగానే పరిగణించాలని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశం లోని రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకుని , రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు వాటిని ఆయుధాలుగా వాడుకుంటోందని ఆరోపించారు. దేశంలోని దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబిఐల పనితీరును రాహుల్ తీవ్రంగా తప్పుపట్టారు.
గతంలో కాంగ్రెస్ ఈ సంస్థల నిర్మాణంలో వ్యవస్థాపరంగా సహకరించినప్పటికీ, బీజేపీ మాత్రం వాటిని తమ సొంత ఆస్తులుగా వాడుకుంటోందని, ప్రతిపక్షాలపై రాజకీయ కేసులు పెడుతోందని విమర్శించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని తాము నిరూపించామని, అలాగే మహారాష్ట ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని తాము భావించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న ఆర్థిక నమూనాపై విమర్శలు గుప్పిస్తూ మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక విధానాలనే బీజేపీ ముందుకు తీసుకెళ్తోందని, ప్రస్తుతం మోడీ ఆర్థిక విధానం పూర్తిగా నిలిచిపోయందన్నారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ కూటమి లోని అన్ని పార్టీలు ఆర్‌ఎస్‌ఎస్ మౌలిక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాయని , తామంతా సమైక్యంగానే ఉన్నామని చెప్పారు.