యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై మూడు మ్యాచుల్లో నెగ్గి.. 3-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనారోగ్యం కారణంగా మూడో టెస్ట్‌కు చివరి నిమిషంలో దూరమైన స్మిత్.. ఇప్పుడు తిరిగి పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు.
ఇక కమ్మిన్స్‌తో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా అందుబాటులో లేడు. మూడో టెస్ట్‌లో లియోన్ తొడ కండరాల భాగంలో గాయమైంది. దీంతో అతడు ఆఖరి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ జట్టులోకి వచ్చాడు. లియోన్ గైర్హాజరీలో మర్ఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో మాట్ కుహ్నెమాన్, కోరీ రోచిసియోలి వంటి స్పిన్నర్లను పక్కన పెట్టి మర్ఫీ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. ఒక కమ్మిన్స్ స్థానంలో జే రిచర్డ్‌సన్‌కు జట్టులో చోటు దక్కింది. రిచర్డ్‌సన్ చివరిగా 2021లో ఆసీస్ తరఫున ఆడాడు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అతడు తిరిగి జట్టులోకి వచ్చాడు.