బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని కోరిన తెలంగాణ ఆర్థిక శాఖ
2026 -27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం
జనవరి 3 లోగా అన్ని శాఖల ప్రతిపాదనలు పంపాలి
మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనకు తెలంగాణ ఆర్థిక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను కోరింది. జనవరి 3లోగా ప్రతిపాదనలు పంపించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన ప్రతిపాదనలు కూడా పంపాలని కోరింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత, శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శులతో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షలు జరిపి బడ్జెట్ కేటాయింపుల అంచనాలపై చర్చిస్తారు. వచ్చే ఏడాది మార్చి నెలలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఏడాది పన్నుల ద్వారా రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలు వచ్చినట్లు అంచనాలున్నాయి.
మార్చి నాటికి పన్నుల వసూళ్లు బాగా పుంజుకుంటాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆర్థిక సంవత్సరానికి తొలి బడ్జెట్‌ను గత ఏడాది శాసనసభలో ప్రవేశపెట్టింది. 2023 డిసెంబర్‌లో పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2024 -25 ఆర్థిక సంవత్సరానికి 2024 ఫిబ్రవరి 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జూలై 25న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అప్పటికే ఆర్థిక సంవత్సరం 4 నెలలు గడచిపోయింది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి ఉభయ సభల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,91,059 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది.
బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేర ఆదాయం ఆ ఏడాది రాలేదు. కేంద్రం నుంచి కూడా భారీగా గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని అనుకున్నా అదీ జరగలేదు. వివిధ కారణాల రీత్యా కొన్ని రంగాల్లో రావాల్సినంత ఆదాయం కూడా ఖజానాకు చేరలేదు. దీంతో అంచనాలను చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం 2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.04 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను సమర్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటిన బడ్జెట్, రూ 2.26 లక్షల కోట్ల ఆదాయ వ్యయం, రూ. 36,504 కోట్ల మూలధన వ్యయాన్ని కలిగి ఉంది.
సంక్షేమానికే పెద్దపీట
సహజంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలు కోసం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ అభయ హస్తం, ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలు, హామీలకు నిధుల కేటాయింపు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతోపాటు మహిళా శక్తి పథకం, ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కోసం మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంకోసం నిధులు కేటాయించనున్నారు. మరో వైపు ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ పనులు, ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితరాలకు బడ్జెట్‌లో నిధులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం, సాగునీటి రంగాలకు యథావిధిగా భారీ కేటాయింపులు ఉండనున్నాయి.
రుణమాఫీ భారం ఈ ఏడాది లేనందున ఆ మేరకు కొంత వెసులుబాటు కలుగుతుందని ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు చేయవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది సంక్షేమ రంగంపై ఎక్కువగా దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిధులు పొందుపరిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలకు సంబంధించి నిధుల కేటాయింపు తప్పనిసరి. వీటన్నింటితో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధనంపై వ్యయం పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచితేనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన కార్యాచరణ అమలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యాయాలను బేరీజు వేసుకుని రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉండనుంది.
టాప్ 5 శాఖలకు అత్యధిక నిధులు
గత ఏడాదిలో బడ్జెట్ వ్యవసాయ, విద్యుత్, రోడ్లు భవనాలు, హోం, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. అత్యధికంగా షెడ్యూల్ కులాల (ఎస్సి) సంక్షేమానికి ఏకంగా రూ.40,234 కోట్లు కేటాయించారు. ఇక షెడ్యూల్ తెగల (ఎస్టి) సంక్షేమానికి మరో రూ.17,169 కోట్లు కేటాయించారు. ఇలా కేవలం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే గత ఏడాది బడ్జెట్ లో సింహభాగం నిధులు కేటాయించారు. ఇక విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయించారు. విద్యను ప్రాముఖ్యతనిస్తూ రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కోసం మొదటి దశలో 58 స్కూళ్ల నిర్మాణానికి రూ.11,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
బడ్జెట్‌లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపులు చూస్తే పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,605 కోట్లు, వ్యవసాయ శాఖ రూ. 24,439 కోట్లు,విద్యా శాఖ రూ. 23,108 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ. 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ. 17,169 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 11,405 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ రూ. 2,862 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ. 3,591 కోట్లు, పశుసంవర్ధక శాఖ రూ. 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖ రూ. 5,734 కోట్లు, కార్మిక శాఖ రూ. 900 కోట్లు, చేనేత రంగానికి రూ. 371 కోట్లు, పరిశ్రమల శాఖ రూ. 3,527 కోట్లు, ఐటీ రంగానికి రూ. 774 కోట్లు, గ్యాస్ సిలిండర్ రాయితీ- రూ723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు, ఎస్డీఎఫ్, సీడీపీ నిధులు రూ.3300 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు కేటాయించారు.