ఫోన్ ట్యాపింగ్ కేసు మరోక సారి హాట్ టాపిక్‌గా మారనుంది. ఈ కేసులో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇవ్వడానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ కమిషనర్ వి.సి సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఈ కేసు విచారణలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా చైన్ ఆఫ్ కమాండ్ పై దృష్టి సారిస్తేనే కేసు కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు బావించారు. దీంతో ఈ కేసులో ముడిపడి ఉన్న వారిని విచారించి ఆ సమాచారంతో వరుసగా విచారణలు సాగిస్తున్నారు. ఈ కేసులో ఓ చానల్ ఎండి శ్రవణ్‌రావు, మాజీ డిఎస్పి ప్రణీత్ రావు మధ్య జరిగిన కాల్ సంభాషణలు రిట్రీవ్ చేసిన విషయం విధితమే. ఈ సంభాషణల ఆధారంగా కెసిఆర్, హరీష్‌రావులకు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. కెసిఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చే ముందు మాజీ సిఎం ఓఎస్‌డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మాజీ సిఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అధికారులు విచారణ సాగించనున్నారు. వీరిద్దరూ ప్రభాకర్ రావు బృందానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు అనే సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ సమావేశాల తరువాత కీలక పరిణామాలు ఉంటాయని, మరికొంత మంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.