బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాజెక్టులపై పచ్చి అబద్దాలు చెబుతున్నారని బిజెపి ఎంపీ డికె అరుణ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత కెసిఆర్‌కు లేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఆర్‌డిఎస్ కోసం పాదయాత్ర చేశానని చెబుతున్న కెసిఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. రాజోలిబండకు, రైతులకు తీరని అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్‌ను మార్చారని ఆమె విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి పదేళ్ళు అధికారంలో ఉన్నా ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. రెండేళ్ళ తర్వాత ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పాలమూరుకు అన్యాయం జరుగుతున్నదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరుకు కెసిఆరే కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.