భూగర్భజలాల్లో, బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు ఇటీవలి పరిశోధనల్లో బయటపడడం శాస్త్రవేత్తల నుంచి వైద్య నిపుణుల వరకు ఆందోళన కలిగిస్తోంది. దీని రేడియో థార్మిక ప్రభావం కన్నా దాని రసాయన విష ప్రభావమే ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యురేనియం స్థాయిలను తగ్గించడం ప్రభుత్వవర్గాలకు ఒక సవాలుగా మారింది. సహజంగా లభించే యురేనియం ఇటీవల దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు సార్లు బయటపడింది. దేశరాజధాని ఢిల్లీలో భూగర్భ జలాల్లో యురేనియం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సిజిడబ్య్లుబి) అధ్యయనంలో తేలింది. బీహార్‌లో ఎఐఐఎంఎస్ పరిశోధకులు, మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ తల్లుల స్తన్య పాలల్లో కూడా యురేనియం అత్యధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ రెండు అధ్యయనాలు ఈ యురేనియం స్థాయిలు పెరిగిపోతుండడాన్ని తీవ్రంగా పరిగణించి అత్యవసర చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీలో సేకరించిన 83 భూగర్భజలాల నమూనాల్లో 24 నమూనాలు బిఐఎస్ స్థాయిలకు మించి యురేనియం ఉందని సిజిడబ్లుబి వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 30 మైక్రోగ్రాముల వరకు యురేనియం పరిమితి ఫరవాలేదు. సహజ యురేనియం వాయువ్య భారతం లోని రాళ్లల్లో ఉంటుంది. హైడ్రొలాజికల్ పరిస్థితుల్లో రాళ్లలోంచి కరిగికరిగి నీటివనరుల్లో చివరకు భూగర్భ జలాల్లో కలుస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల యురేనియం ఆహార గొలుసులోకి చేరుకునే అవకాశం ఉంది. దీని కచ్చితమైన మూలాన్ని తెలుసుకోవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు చేస్తోంది. నైట్రేట్, ఫ్లోరైడ్, స్లైనిటీ, భారీ లోహాలు కూడా అనేక ప్రాంతాల్లో ఎక్కువస్థాయిల్లో కనిపించాయి. దీనిని బట్టి నీటివనరులపై ఈ లోహ మూలకాల ప్రభావం పెరిగిందని బయటపడింది. బీహార్‌లోని ఆరు జిల్లాలకు చెందిన దాదాపు 40మంది బాలింతల తల్లిపాల నమూనాల్లో యురేనియం ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. అన్ని నమూనాల్లో యురేనియం (యు238) ఉన్నట్టు ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్‌వర్మ వెల్లడించారు. దీని గాఢత 0 నుంచి 5.25 మైక్రోగ్రాములు, లీటరు మధ్య నమోదైంది. దాదాపు 70% శిశువుల్లో యురేనియం ప్రభావం వల్ల అనేక అనారోగ్య సమస్యలువచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల అంచనా.అయితే బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని తాగే శిశివులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని, దీనివల్ల తల్లుల ఆరోగ్యం పైనా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే బీహార్ బాలింతల పాలలో గుర్తించిన యురేనియం స్థాయిలు సురక్షితమైన పరిమితుల్లోనే ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే తాగునీటి లోనే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా యూరేనియం స్థాయిలు ఉన్నాయని బయటపడింది. ముఖ్యంగా బీహార్‌లోని ఖగారియా జిల్లాలో యురేనియం సగటు స్థాయి అత్యధికంగా ఉండగా, కటిహార్‌లో ఒకే నమూనాలో అత్యధిక గాఢత నమోదైంది. అయితే తల్లిపాలలో యురేనియం స్వల్ప మోతాదులో ఉన్నప్పటికీ శిశువులకు ఎలాంటి ప్రమాదం ఉండదని మరికొందరు పరిశోధకులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) తాగు నీటిలో యురేనియం కోసం నిర్దేశించిన పరిమితి 30 మైక్రోగ్రాములు/లీటరు. తల్లిపాల నమూనాల్లో లభించిన స్థాయి (గరిష్టంగా 5.25 మైక్రోగ్రాములు/ లీటరు) ఈ డబ్లుహెచ్‌ఒ ప్రమాణం కంటే చాలా తక్కువగా ఉంది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం తల్లి శరీరంలోకి చేరిన యురేనియంలో ఎక్కువ భాగం మూత్రం ద్వారానే బయటకు వెళ్లిపోతుంది. తల్లిపాల లోకి చేరే యురేనియం శాతం చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. భూగర్భజలాల్లో యురేనియం ఉన్నట్టయితే రేడియో ధార్మిక లక్షణాల కన్నా రసాయన కాలుష్యం ఎక్కువగా పెరుగుతుందని చెబుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. యురేనియం గనుల్లో పనిచేసేవారికి, యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్లలో పనిచేసే వారికి మూత్రపిండాలు దెబ్బతినే సమస్య ఏర్పడుతుంది.
యురేనియం తక్కువ స్థాయిలో ఉన్న నీటిని తాగిన వారికి రేడియేషన్ కన్నా, రసాయన విష ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీలోని భూగర్భజలాల్లో రేడియో థార్మికత బలహీనంగా కనిపించినా, మూత్రపిండాల కణాలపై దాని విష తీవ్రప్రభావమే దేశంలో తీరని సమస్యగా ఉంటోంది. యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యావరణ పరంగా ప్రేరేపితమైన మూత్రపిండాల వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం, కొన్ని రసాయనాలకు గురికావడం మూత్రపిండాల వ్యాధులకు దోహదం చేస్తున్నట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆహారం, తాగునీటిద్వారా యురేనియం లోపలికి ప్రవేశించడం సర్వసాధారణమే అయినప్పటికీ దుమ్ముధూళి పీల్చడం ద్వారా లేదా గాయపడిన చర్మం ద్వారా కూడా యురేనియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. లోపలికి వెళ్లిన తరువాత ప్రధానంగా మూత్రపిండాలపైనే యురేనియం ప్రభావం మొదట కనిపిస్తుంది. ప్రధానంగా మూత్ర నాళికలను పాడు చేస్తుంది. దాంతో అవి పనిచేయకుండా పోతాయి. యురేనియం అత్యధిక స్థాయిల్లో ఉంటే క్రమేణా కాలేయం, ఊపిరితిత్తులు, నాడీవ్యవస్థలకు హాని కలిగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో వాపు కనిపిస్తుంది. బరువు తక్కువ శిశువులు జన్మించడం లేదా నెలలు నిండకముందే ప్రసవించడం వంటి సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి.
కె. యాదగిరి రెడ్డి 98667 89511