విశాఖపట్నం: శ్రీలంకతో మంగళవారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య భారత మహిళా జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆతిథ్య జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కిందటి మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. ఈసారి కూడా ఆమెపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, అమన్‌జీత్ కౌర్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. ఇక శ్రీలంకకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. పటిష్టమైన టీమిండియాను ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు.