టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డుల గని. తన కెరీర్‌లో విరాట్ ఎన్నో అనితరసాధ్యమైన రికార్డులను బద్దలుకొట్టాడు.. సృష్టించాడు కూడా. టి-20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కోహ్లీ సిద్ధమవుతున్నాడు. అయితే కోహ్లీ ఎదుట మరో రికార్డు ఎదురుచూస్తోంది.
విరాట్ కోహ్లీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ అడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నాడు. అంధ్ర జట్టుతో డిసెంబర్ 24న మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 14,557 వన్డే పరుగులు ఉన్నాయి. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓవరాల్‌గా 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆంధ్రతో జరిగే మ్యాచ్‌లో 1 పరుగు చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్‌లో 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు విరాట్. తద్వారా ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో కోహ్లీ కంటే ముందు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ లిస్ట్-ఎ ఖాతాలో 21,999 పరుగులు ఉన్నాయి.