భువనేశ్వర్/మల్కన్‌గిరి : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో పోలీసుల ఎదుట మంగళవారంనాడు 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరి తలల మీద రూ.2కోట్ల రివార్డు ఉంది. లొంగుబాటు సమయంలో మావోయిస్టులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, మావోయిస్టుల సాహిత్యాన్ని కూడా అప్పగించారు.
ఈ సందర్భంగా డిజిపి వైబి ఖురానియా మాట్లాడుతూ… లొంగిపోయిన మావోయిస్టుల్లో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఆరుగురు డివిజినల్ కమిటీ, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులని అన్నారు. వీరంతా పొరుగురాష్ట్రం చత్తీస్‌గఢ్‌కు చెందిన వారని, అయితే వాళ్ల కార్యకలాపాలు మాత్రం ఒడిశాలోనే జరిపే వారని అన్నారు. మిగతా వారంతా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులని వివరించారు.