ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఊడ్చేస్తోంది. ఒకప్పుడు తిరుగులేని ఉద్యోగ రంగంగా ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో కొలువు. ఈ రోజుల్లో గాల్లో దీపంలా మారింది. గతంలో ఓ ఉద్యోగిని తొలగించారంటే ఎన్నో కారణాలు ఉండేవి. ఈ ఏడాది ఎఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఉద్యోగాలు పోయినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతుండగా, వీటిలో నూటికి 90 టెక్ ఉద్యోగాలే కావటం గమనార్హం. ఇలా ఉద్యోగాలు పీకేసిన సంస్థల్లో టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలుండటం గమనార్హం. వీటిలో ఒక్క టిసిఎస్ సుమారు 20 వేల ఉద్యోగులను ఇంటికి పంపింది. గతంలో ఎవరి ఉద్యోగమైనా పోతే.. అనేక కారణాలుండేవి. కానీ, ప్రస్తుతం ఏ టెక్ సంస్థ అయినా లేఆఫ్ ప్రకటించిందంటే దానికి ఎఐ ప్రభావమే కారణమవుతోంది. ఈ నేపథ్యంలో టెక్ రంగంలోని ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సి వస్తోంది. ఏ రోజుకారోజు దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షుఅన్నట్లుగా వారు భయభయంగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో తమ ఉద్యోగులను పెద్దమొత్తంలో తొలగించనున్నట్టు 41% కంపెనీలు పేర్కొన్నట్టు వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. ప్రధాన రంగాల్లోకి ఎఐ ప్రవేశించడమే దీనికి కారణంగా వివరించింది. అమెజాన్ ఎఐలో భారీ పెట్టుబడులు పెడుతోంది. 2025 నాటికి ఎఐ మెషిన్ లెర్నింగ్‌లో సుమారు ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ పెట్టుబడులతో, సంస్థలోని హై-పెయిడ్ వైట్-కాలర్ ఉద్యోగులను ఎఐద్వారా భర్తీచేయాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తోంది. అమెజాన్ లేఆఫ్‌ల ప్రత్యక్ష ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఇతర బహుళజాతి కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌లోని అవుట్‌సోర్సింగ్ హబ్‌లు ఇప్పటికే ఎఐ నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చాలా వరకు ఐటి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తున్నాయి.
రానున్న రోజుల్లో దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్, ఐబిఎం వంటి పెద్ద కంపెనీలు సుమారు 70,000 మంది ఉద్యోగులను తొలగించారు. మైక్రోసాఫ్ట్ లాభదాయకతను పెంచుకోవడం, ఎఐ, డేటా సెంటర్లలో భారీ పెట్టుబడుల కోసం ఉద్యోగులను తొలగిస్తోంది. ఐబిఎం హెచ్‌ఆర్ కార్యకలాపాలలో ఎఐ వ్యవస్థలను విస్తృతంగా ప్రవేశపెట్టి 8 వేల మంది ఉద్యోగులను తగ్గించింది. అమెరికా టెక్ దిగ్గజాలు భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సేల్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ లేఆఫ్‌లు భారతీయ ఉద్యోగులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతాయి. ఐటి రంగంలో ఇప్పుడు ఆటోమేషన్, ఎఐ టెక్నాలజీలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీల పుణ్యమా అని పునరావృత పనుల్లో ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. మిగతా పనుల్లోనూ ఐటి కంపెనీలు ఎఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి. అందుకోసం ఉన్న ఉద్యోగులకే కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నాయి. ఆ టెక్నాలజీలపై పట్టు సాధించలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఐటి ఉద్యోగులకు ఎఐ ఒక పెద్ద సవాలుగా మారింది. పొదుపు చర్యలు, పెరుగుతున్న నైపుణ్య అవసరాలు, ఆటోమేషన్, ఎఐ అడాప్టేషన్ ఒత్తిళ్లతో ఉద్యోగ ప్రపంచం తలకిందులవుతోంది. ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అనే టెన్షన్‌తో టెకీలు ఆందోళన చెందుతున్నారు. ఇఎంఐలు ఎలా కట్టాలి? మరో ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. కంపెనీలు వ్యయం తగ్గింపు, నష్టాల నియంత్రణ వంటి కారణాలకు బదులు, ఇప్పుడు సంస్థ పునర్నిర్మాణం, పురోగతి, వర్క్‌ఫోర్స్ ఆప్టిమైజేషన్ వంటి పదాలను ఉపయోగిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కమ్యూనికేషన్లు, పాడ్‌కాస్టింగ్, పరికరాలు, హెచ్‌ఆర్, సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లలో కోతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత ఐటి రంగంలో సైలెంట్ లేఆఫ్‌లు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఎఐ సాంకేతికతతో ఇంజనీరింగ్ పనులను ఆటోమేట్ చేయడం, వ్యయ తగ్గింపు చర్యలు, వ్యాపార వృద్ధిలో మందగమనం వంటివి దీనికి కారణాలు. కంపెనీలు సామూహిక లేఆఫ్‌లను ప్రకటిస్తే మార్కెట్లో చెడు సంకేతం వెళ్తుందని భావించి, ఉద్యోగులే స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేసే పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఎఐ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5 శాతంమంది ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. నైపుణ్యాల్ని పెంచుకోకపోతే కెరీర్‌కు రక్షణ ఉండదని 87.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. వచ్చే పదేళ్లలో 40 శాతం వరకు జాబ్స్ ఎఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని, దీంతో 89 శాతం మేర ఇంజినీర్లు ఎఐ, ఎంఎల్ లోనే కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాలనుకుంటున్నారని ఆ అధ్యయంలో పేర్కొంది. ఎఐ విప్లవంపై మరో వాదన కూడా ఉంది. ఎఐ అభివృద్ధి వల్ల ఉద్యోగాల స్వరూపం మారుతుందని ఒకవైపు చర్చ జరుగుతుంటే, అనేక సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాలను తొలగిస్తూ, దానికి ఎఐ ని కారణంగా చూపుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఎఐ సాధనాలు ఇప్పటివరకు కొన్ని రంగాల్లో మాత్రమే ప్రభావవంతంగా ఉన్నాయని, వేలాది మంది ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసే స్థాయికి ఇంకా చేరలేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఎఐ సునామీని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది, భారతీయ ఉద్యోగ మార్కెట్ ఈ మార్పులకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది.
కోడూరు సాల్మన్ రాజు
96525 82025