మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) స్థానంలో వికసిత్ భారత్ -రోజ్ గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) 2025 లేదా జి రామ్ జి బిల్లు పై చర్చ సాధారణస్థాయిని మించి సాగుతోంది. ఈ పథకం రాజ్యాంగ సూత్రాలు, ఫెడరల్ వ్యవస్థాపరమైన సంబంధాలు, సంక్షేమ పరమైన ఆర్థిక అంశాలు, రాజకీయ ప్రతివాదంతో పాటు లక్షలాది గ్రామీణ కార్మికుల జీవన వాస్తవికతతో ముడిపడి ఉంది. ఇది కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. రానున్న దశాబ్దాలలో భారతదేశం తన పేద పౌరులతో ఎటువంటి సామాజిక సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటోంది అన్నదే కీలక ప్రశ్న. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎంఎన్‌ఆర్ ఇజిఎ భారతదేశంలో అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమంగా సాగుతోంది. గ్రామీణ పేదలకు ఏటా కనీసం 100 రోజుల పనిని హామీగా కల్పిస్తోంది. దేశంలో పరిమిత ఉపాధి అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఈ పథకం కీలక పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య భారతంలో, పారిశ్రామిక పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉండి, వేతన ఉపాధి కాలానుగుణంగా ఉండే రాష్ట్రాలకు ఇది జీవనాధారంగా ఉంది.
ఈ పథకం కొనుగోలు శక్తిని బలోపేతం చేసింది. కష్టాలను తీర్చింది, వలసలను తగ్గించింది. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యానికి మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా కొవిడ్ -19 వంటి సంక్షోభ సమయంలో ఆదాయ భద్రతను అందించింది. అయితే, ప్రస్తుతం ఎంఎన్‌ఆర్ ఇజిఎ పథకం అనిశ్చిత స్థితిలో ఉంది. దీనిని చక్కదిద్దేందుకు కేంద్రం చేసిన ప్రయత్నం పలు ఆర్థికపరమైన, పాలనాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. సైద్ధాంతిక, సాంకేతిక ప్రశ్నలనూ లేవనెత్తుతోంది. పేదల సంక్షేమ హక్కుగా ఉన్న పథకానికి మహాత్మాగాంధీ పేరుమార్పు కేవలం విధానపరమైన మార్పేనా. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న హిందుత్వ విధానాల కారణంగా, రాజకీయ సాంసృ్కతికపరమైన నేపథ్యం ఏమయినా ఉందా. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. అన్నవే ఆ ప్రశ్నలు. ఈ వ్యాసం భారతదేశంలో గ్రామీణ సమాజం, రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఇతర అంశాలను చర్చించడంతో పాటు ప్రమాదంలో పడిన సమస్యను పరిశీలిస్తుంది. ఎమ్‌ఎన్‌ఆర్ ఇజిఎ పథకం అమలు వల్ల ఎన్నో ఆర్థికపరమైన ప్రయోజనాలు కలిగాయని కార్తీక్ మురళీధరన్, పాల్ నీ హాస్, సందీప్ సుఖ్తంకర్ వంటి నిపుణులు పదేపదే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంవల్ల గ్రామీణుల ఆదాయం దాదాపు 14% పెరిగిందని, పేదరికం దాదాపు 26% తగ్గిందని క్షేత్రస్థాయిలో అధ్యయనాల ఆధారంగా నిరూపించారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల వేతనస్థాయి పెరిగింది. మార్పు వచ్చింది. వ్యవసాయ కూలీలు, కార్మికుల బేరసారాల శక్తిని పెంచింది. ఈ పథకం వల్లనే వారికి డిమాండ్, గౌరవం పెరిగింది. గ్రామీణ పేదలకు ఎంపిక చేసుకునే అవకాశం కలిగింది.
ఉపాధి హామీ పథకం భారతదేశంలో అత్యంత సంక్షోభ సమయంలో నివారణమంత్రంగా పనిచేసింది. ముఖ్యంగా కొవిడ్ -19 మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాదిమందికి సురక్షితమైన జీవనోపాధిగా మారింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి.ప్రైవేటు ఉపాధి అవకాశాలూ తక్కువే. ఏడాది పొడవునా వ్యవసాయం ఉండదు, అలాంటి రాష్ట్రాలలో ఈ మహాత్మాగాంధీ పథకం ఆర్థికపరమైన స్థిరీకరణ శక్తిగా పనిచేసింది. పేదల ఆకలి తీర్చేందుకు అవసరమైన వేతనాలను అందించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పేదలకు అన్ని విధాలా అండగా నిలిచింది. అటువంటి పథకాన్ని నీరుగార్చడం అంటే, స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన సామాజిక హామీని అణచివేయడమేనని విమర్శకులు అంటున్నారు.
ఎంఎన్‌ఆర్‌ఇజిఎ స్థానే -జి రామ్ జి -భర్తీ చేయడానికి ప్రభుత్వం మూడు కారణాలు చెబుతోంది. మొదటిది. ఈ పథకం కింద పెరిగిన వేతనాలు, ఉత్పాదకతను మించిపోయాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పెంచింది. రెండవది. ఉపాధి హామీ పథకం కారణంగా వ్యవసాయ కార్యకలాపాలకు కార్మికులు దూరమయ్యారు. ఫలితంగా వ్యవసాయంలో కార్మిక మార్కెట్ దెబ్బతింది. మూడవది- కార్మికులలో నైపుణ్యంపెంచి, ఉత్పాదకత ఆధారంగా అభివృద్ధి సాధించడం ద్వారా, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఈ కార్యక్రమంలో సంస్కరణలు, దిశానిర్దేశం అవసరం. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జి రామ్ జి బిల్లు కొత్తబిల్లు హామీ పనిదినాలను 100 నుంచి 125కి పెంచుతుంది. అవకాశాలు విస్తరిస్తాయి. ఒకే విధమైన వేతనాలను ప్రవేశపెడుతుంది. కొత్త వర్గాలకు అందుబాటులో ఉంటుంది. కేంద్రీకృత స్థాయిలో శ్రామికశక్తి ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ఈ సంస్కరణలు 2005 నుంచి పెద్దగా అభివృద్ధి చెందని పథకానికి అవసరమైన, ఆధునీకరణను ప్రతిపాదిస్తున్నది. ఏదైనా పెద్ద ప్రజా కార్యక్రమానికి కాలానుగుణంగా సమీక్ష అవసరమనే వాదన ఉండనే ఉంది.
కొత్త బిల్లు పథకం ప్రాథమిక స్ఫూర్తిని దెబ్బతీస్తుందని వ్యాఖ్యాతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ హక్కుల ఆధారితమైన పథకం.పనిని డిమాండ్ చేసి పొందవచ్చు. లేకుంటే, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఇది నిర్దేశిస్తుంది. కొత్త బిల్లులో ఈ అవకాశం లేదు. డిమాండ్ ఆధారిత ఉపాధిని కేంద్రీకృత లక్ష్యాలు, బడ్జెట్ పరమితులు నిర్దేశిస్తాయి. ఈ మార్పు చట్టపరమైన హక్కును సంక్షేమ రాయితీగా మార్చే ప్రమాదం ఉంది. ఆర్థికవేత్త ప్రతాప్ భాను మెహతా హెచ్చరించినట్లుగా ఈ సంస్కరణలు ఉపాధి హామీ పథకం సాధించిన మార్పును దెబ్బతీయవచ్చు. గ్రామీణ పేదల సాధికారత కోసం కాక, శ్రమను హక్కుగా చెప్పుకునే అవకాశం ఉంది.
ఉపాధి హామి పథకం పేరు మార్పు సంచలనంగా మారింది. శ్రమకు గౌరవం కల్పించే కార్యక్రమానికి గాంధీ పేరు మార్చడం రాజకీయ పరమైన ప్రతీకవాదమే. ఈ నిర్ణయం వెనుక హిందూత్వ ఉద్దేశం ఉందా.. అన్నది ప్రశ్న. సంస్థలు, స్టేడియాలు, పథకాలు నగరాల పేర్ల మార్పు మాదిరిగానే, కొత్త సామాజిక జాతీయవాద దృక్పథానికి అనుగుణంగా ఉపాధి పథకం పేరు మార్పు జరిగింది అనుకోవచ్చు. గాంధీని బహిరంగంగా గౌరవించినా, ప్రస్తుత సర్కార్‌కు రాజకీయంగా అసౌకర్యంగా ఉంది. ముఖ్యంగా బిజెపి సైద్ధాంతిక సూత్రాలకు చుక్కెదురు. గాంధీ పేరును వికసిత్ భారత్‌తో భర్తీ చేయడం ప్రధాని మోడీ రాజకీయపరమైన ఆలోచనే. ఇది ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో తీసుకువచ్చిన మార్పునకు తామే కారణమని క్లయిమ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. హిందూత్వ కోణం ఉన్నా లేకున్నా, పథకంపై క్లయిమ్ చేసుకోవడానికే అన్నది సుస్పష్టం. మహాత్మాగాంధీ ఉపాధి పథకం కేంద్రానికి రాజకీయంగా అసౌకర్యంగా ఉంది. పెద్ద పథకం, పెద్దఖర్చు, గ్రామీణ పేదలే నడుపుతున్నది. ఇది పంచాయితీలకు అధికారం ఇస్తుంది. కేంద్ర ఆదేశాన్ని బలహీనపరుస్తుంది. ఇది దళితులు, ఆదివాసీలు, మహిళలు, భూమిలేని కార్మికులతో సహా, అత్యంత అణగారిన వర్గాలకు అధికారాన్ని అందిస్తుంది. బిజెపి తన ఎన్నికల ప్రచారంలో ఈశాన్య రాష్ట్రాలపై గురిపెట్టింది. ఈ కార్మిక హామీని బలహీనపరచడం తీవ్ర సామాజిక, రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చు. అసోం, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ లలో ఈ పథకంపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గడం, వలసలు పెరగడానికి దారితీయవచ్చు. ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఈ పథకానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రప్రభుత్వ ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది.ఈశాన్య రాష్ట్రాలకు స్వతంత్ర ఆదాయ మార్గాలు లేవు. సంక్షేమ పథకాలకు అవి కేంద్రం మద్దతు పై ఆధారపడి ఉన్నాయి.
తీవ్ర ఆందోళన కలిగించే అంశం వ్యవసాయ సీజన్‌లో ఉపాధి స్తంభించే అవకాశం. పంటకోత కోసం కార్మికుల అవసరాలు తీర్చేందుకు, ఈ పథకం వీలు కల్పించవచ్చు. వ్యవసాయ ఆఫ్- సీజన్‌లో ఉపాధి హామీ వేతనాలు జీవనాధారంగా మారతాయి. అదే విధంగా, ఉపాధికి బయోమెట్రిక్ ప్రాతిపదిక కావడంతో కనెక్టివిడీ లేని ప్రాంతాలలో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఫలితంగా, పరిమిత డిజిటల్ అక్షరాస్యత ఉన్న మహిళలు, వృద్ధ కార్మికులు, గిరిజనులు, వలసలకు వెళ్లే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం ఆర్థికంగానే కాక, సామాజికంగా కూడా విజయం సాధించింది. సంస్కరణపై చర్చ కేవలం, ఉత్పాదకత, ఆర్థిక క్రమశిక్షణ గురించి చెబుతున్నా, ఆ పథకం సాధించిన సామాజిక మార్పును గుర్తించడం లేదు. ఎంఎన్‌ఆర్ ఇజిఎ పథకం కేవలం ఆస్తులను సృష్టించలేదు. గ్రామీణులకు వాయిస్ ఇచ్చింది. లక్షలాది మంది గ్రామీణ మహిళలకు వేతన హక్కు డిమాండ్ చేసేలా నేర్పింది. మౌలిక సదుపాయాలను నిర్మించడంతో పాటు, మధ్యవర్తులను తగ్గిచింది. పని కల్పించడం రాష్ట్ర బాధ్యత అనే రాజకీయ సూత్రాన్ని స్థిరపరచింది. పథకం సాధించిన విజయాలను రాజకీయంగా, ఆర్థిక పరంగా తక్కువగా చూపడం చరిత్రాత్మకమైన తప్పిదమే.
సంస్కరణ అవసరం, నిర్మాణాత్మక మార్గంలో ఇవి అవసరం. రాష్ట్ర ఆర్థిక వాటా క్రమంగా పెంచడం, పారదర్శకత విధానాలను బలోపేతం చేయడం, సామాజిక తనిఖీలను పక్కన పెట్టకుండా రక్షించడం, ఆస్తి పెంచే వర్గాలను విస్తరించడం, ఎంఎన్ ఆర్ ఇజిఎ కింద నిర్మించిన మౌలిక సదుపాయలు దీర్గకాలిక అభివృద్ధికి ఉపయోగించాలి, నీటి నిర్వహణ, నీటి పారుదల, వాతావరణ పరిరక్షణకు కృషి చేయాలి. ఈశాన్య రాష్ట్రాలలో ఇబ్బందులను పరిష్కరించాలి, భూమి, పర్యావరణ పరిరక్షణకు తగిన పథకాలు విస్తరించాలి. సౌకర్యవంతమైన వేతన చెల్లింపు వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు ప్రాధాన్యత నిధులు అవసరం. అలాగే నిర్మాణాత్మకమైన మార్పు చేపట్టే ముందు రాష్ట్రాలను సంప్రదించాలి. ఫెడరల్ వ్యవస్థ సంస్కరణలకు అడ్డంకిగా మారకూడదు. చివరిగా, పేరు పెట్టడం ముఖ్యం. గాంధీ పేరును తొలగించడం నామ్ కే వాస్తేగా మారరాదు. సమగ్రమైన విధానం, దాని వ్యవస్థలు, లక్ష్యాలను నవీకరిస్తూ, పథకం చారిత్రక గుర్తింపును నిలుపు కోవాలి. ఉపాధి పథకం ప్రస్తుతం క్రాస్ రోడ్ దశలో ఉంది. అంటే మలుపు తిరిగిన దశలో ఉంది, సంస్కరణలు దాని విలువను మరింత పెంచవచ్చు. గాంధీ పేరును తొలగించడం మారుతున్న రాజకీయ దృక్పథాన్ని సూచిస్తోంది. ఈ కార్యక్రమం భారతదేశ సంక్షేమ నిర్మాణానికి మూలస్తంభంగా ఉండాలంటే, గ్రామీణ గౌరవం, పని చేసే హక్కును తిరిగి ధ్రువీకరించడంపై ఆధారపడి ఉంది.
గీతార్థ పాఠక్
ఈశాన్యోపనిషత్