బిజెపి బహిష్కృత నేత, ఉన్నావ్ అత్యాచారం కేసులో జీవితకాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న కుల్‌దీప్ సెంగార్‌కు భారీ ఊరట లభించింది. ఆయన జైలు శిక్షను మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సుబ్రహ్మణం ప్రసాద్, హరీశ్ వైద్యనాథ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విడుదలకు ఆదేశించింది. రూ.15లక్షల విలువైన మూడు పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది. బాధితురాలి నివాసానికి ఐదు కిలో మీటర్ల దూరం పాటించాలని, ఆమెతో పాటు కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బెదిరింపులకు గురిచేయరాదని ఆదేశించింది. వీటిలో ఏ నిబంధనను కూడా అతిక్రమించినా బెయిల్ రద్దు చేస్తామని సెంగార్‌ను కోర్టు హెచ్చరించింది. 2019 డిసెంబర్‌లో ట్రయల్ కోర్టు ఆదేశాలను సెంగార్ ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉండడంతో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది. ఒకవేళ పెండింగ్‌లో ఉన్న అప్పీల్‌పై తీర్పు వెలువడి దోషిగా తేలితే సెంగార్ పూర్తి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 2017లో సెంగార్ మైనర్ బాలికను కిడ్నాప్ చేయడమే కాకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.