న్యూయార్క్/వాషింగ్టన్: భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ మరోసారి వెల్లడించారు.లక్షల సంఖ్యలో ప్రజల జీవితాలను కాపాడానని పాకిస్థాన్ ప్రభుత్వం తనను మెచ్చుకుందన్నారు. పాకిస్థాన్ అధినేత, గౌరవ ప్రదమైన జనరల్, ఫీల్డ్ మార్షల్‌తోపాటు ఆ దేశ ప్రధాని కూడా తన మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్నట్టు చెప్పారు. ఫ్లోరిడా లోని మార్ ఏ లాగో ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఎనిమిది యుద్ధ విమానాలు కూలిపోవడం మీకు తెలుసు. ఆ యుద్ధం మళ్లీ తీవ్రంగా మారే సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కోటి మంది ప్రాణాలను కాపాడారని అన్నారని,అన్ని యుద్ధాలను పరిష్కరించినా, ఇంకా ఒక యుద్ధం పరిష్కారం కాలేదని, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తాను ఆపలేక పోయా” అని ట్రంప్ పేర్కొన్నారు. గత మే 10 నుంచి ట్రంప్ తాను భారత్‌పాక్ యుద్ధం ఆపానని సోషల్ మీడియా ద్వారా అరవైసార్లుకు మించి ప్రకటిస్తున్నారు. అయితే భారత్ మాత్రం నిర్దంద్వంగా ట్రంప్ ప్రకటనను ఖండిస్తూ వస్తోంది.
కొత్త నేవీ యుద్ధనౌకల నిర్మాణం
ట్రంప్ శ్రేణి భారీ యుద్ధ నౌకలను నిర్మించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డెన్ ఫ్లీట్ ప్రాజెక్టులో ఇవి భాగంగా పేర్కొన్నారు. తమ నౌకాదళాన్ని 2025 యుద్ధ నౌకలతో విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నట్టు వివరించారు. రెండు కొత్త యుద్ధ నౌకల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అన్ని యుద్ధ నౌకలకంటే పెద్దవని, 100 రెట్లు శక్తిమంతమైనవని పేర్కొన్నారు. తుపాకులు, క్షిపణులతో పాటు అణ్వాయుధాలను ప్రయోగించే సత్తా వీటికి ఉంటుందన్నారు.