గువాహతి : అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కనీసం 45 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 38 మంది పోలీసులు కూడా ఉన్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఆక్రమణదారులను వెళ్లగొట్టాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లలో దివ్యాంగుడైన 25ఏళ్ల సురేశ్ డేతో పాటు మరో యువకుడు మృత్యువాతపడ్డాడు. తాజా అల్లర్లపై సిఎం హిమంత బిశ్వ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఆందోళనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని డిజిపి స్పష్టం చేశారు. అల్లరిమూక రాళ్ల దాడిలో ఐపిఎస్ అధికారితో పాటు 38మంది పోలీసులు గాయపడ్డారని ఆయన తెలిపారు.